స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలుకు వెళ్లి నెలరోజులు దాటింది అన్నారు. అయితే, ఆయనకు జైలులో సరియైన సదుపాయాలు కల్పించడం లేదని, ఆరోగ్యం క్షీణిస్తుందని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Kalyan Ram Devil: ఈ మలయాళ హీరోయిన్ ని చాలా కొత్తగా చూపించారు…
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ అన్నారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేనాని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరి ఎంటో స్పష్టంగా సూచిస్తున్నాయని పవన్ అన్నారు. డాక్టర్ల నివేదికలను పట్టించుకోకపోవడంతో పాటు చంద్రబాబు ఆరోగ్యం విషయం, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేయ్యాలని జనసేన అధినేత కోరారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.