టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల ప్రాణ హాని ఉందన్నారు. ఇటీవల మండలిలో బొత్స పనితీరు బావుందని, ఇది జగన్‌కు నచ్చదు అన్నారు. గతంలో బాబాయ్‌కు జరిగినట్టే బొత్సకు కూడా జరగచ్చు అన్నారు పల్లా. ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రాణ హాని ఉండదన్నారు. బొత్స తనకు ప్రాణ హాని ఉందని చెప్పడంతో పల్లా శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నారని బొత్స ఆరోపించారు. ఇటీవల జరిగిన పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవడంపై కలెక్టర్, ఎస్పీలపై మండిపడ్డారు.
‘అమ్మవారి పండగపై బొత్స సత్యనారాయణ అధికారులను నిందించడం సరికాదు. పండగ వైభవంగా జరిగింది. దీనిని సహించలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రోజుల ముందు మాకు ఆయన షెడ్యూల్ ఇచ్చారు. స్టేజ్ వేసింది వాళ్ల మనుషులే.. స్టేజ్ చుట్టూ వాళ్లకి కావల్సిన కలర్ క్లాత్ లే కట్టుకున్నారు. ఇరవై అయిదు మందికి సరిపడా స్టేజ్ వేశాం. అయితే యాభై మంది స్టేజ్ పైకి వెళ్తే ఏమవుతుంది. పండగ రోజు వర్షం పడింది.స్టేజ్ కొద్దగానే ఒరిగింది.. ఏం కాలేదు. మాకు బొత్స సత్యనారాయణ అంటే గౌరవం ఉంది. సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్న నాయకుడు. ఇందులో ఎలాంటి కుట్రా లేదు. పండగకు హుండీ పెట్టామనడం సరికాదు.. స్వచ్ఛందంగా ఇచ్చిన వారి నుంచే తీసుకున్నాం. బలవంతపు వసూళ్లు లేవు’ అని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.