పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కుమార్తె అసీఫాఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసీఫా సింధ్ ప్రావిన్స్‌లోని షహీద్ బెనజీరాబాద్ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు. ఆమె తండ్రి దేశ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో షహీద్ బెనజీరాబాద్ నుంచి అసీఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అసీఫా భుట్టో.. జర్దారీ, బెనజీర్ భుట్టో చిన్న కుమార్తె. ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రిగా తోడుగా ఉంటున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఉప ఎన్నిక కోసం సింధ్ ప్రావిన్స్‌లోని షహీద్ బెనజీరాబాద్ ప్రాంతం నుంచి నేషనల్ అసెంబ్లీ సీటు కోసం అసీఫా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమెతో పాటు నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు ఉపసహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించారు. ముగ్గురు అభ్యర్థులు అబ్దుల్ రసూల్ బ్రోహి, అమానుల్లా, మైరాజ్ అహ్మద్ బరి నుంచి తప్పుకున్నారు. ఇక ఆమెకు ఎవరు పోటీ లేకపోవడంతో ఆసీఫాను విజేతగా ప్రకటించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ అనుభవం లేకపోయినా అంకిత భావంతో ప్రజా సేవ చేస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఆసీఫా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అసీఫాను దేశ ప్రథమ మహిళగా చేయాలని జర్దారీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
