PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఉంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌ను ప్రకటించక ముందే, ఆరుగురు ప్రధాన ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో డిసెంబర్ 14 నుంచి జనవరి చివరి వరకు జరిగే బిగ్ బ్యాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు ఎన్ఓసీ పత్రాలను పీసీబీ మంజూరు చేసింది. దీంతో బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లు బీబీఎల్‌లో పాల్గొంటున్నారు. డిసెంబర్ 2024 నుంచి జాతీయ టీ20 జట్టులో లేని మహ్మద్ రిజ్వాన్‌ను మినహాయిస్తే, మిగతా ఆటగాళ్లందరూ ప్రస్తుతం పాకిస్తాన్ టీ20 జట్టులో ఉన్నవారే.
Read Also: Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..
అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మొత్తం బీబీఎల్ సీజన్ కోసం పాకిస్థాన్ ప్లేయర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. డిసెంబర్- జనవరి చివరి వారం వరకు పాకిస్తాన్‌కు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు లేకపోవడంతో మొత్తం లీగ్ లో ఆడవచ్చని ఇరు బోర్డులు (ఆస్ట్రేలియా- పాకిస్థాన్) మధ్య ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. ఇప్పుడు పీసీబీ క్రికెట్ ఆస్ట్రేలియాతో మరోసారి చర్చలు జరిపి తమ ఆటగాళ్లను శ్రీలంక సిరీస్‌కు వెనక్కి పిలిపించాలని కోరే అవకాశం ఉందని టాక్. అలా, కుదరని పక్షంలో ప్రధాన ఆటగాళ్లు లేకుండానే కొత్త ముఖాలను శ్రీలంక సిరీస్‌కు పాకిస్థాన్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక, గతంలో కూడా లీగ్‌లలో ఆడేందుకు సంతకం చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లను పీసీబీ అకస్మాత్తుగా వెనక్కి పిలవడంపై రచ్చ కొనసాగింది. అయితే, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, నసీమ్ షా లాంటి ఆటగాళ్లు ఎమిరేట్స్ లీగ్‌లో ఆడటానికి పీసీబీ అనుమతించినప్పటికీ, ఆ లీగ్ శ్రీలంకలో జరిగే మ్యాచ్‌ల కంటే ముందే ముగుస్తుంది.
