Pakistan Minister: సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ) విషయంలో పాకిస్థాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ, ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. భారత్‌తో నడుస్తున్న వివాదం మధ్య ఇస్లామాబాద్ సరికొత్త సవాల్ విసిరింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు దక్కాల్సిన వాటాపై కన్నేసే వారి చేతులను నరికేస్తాం అంటూ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మలిక్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల నాటి ఈ జలాల ఒప్పందంపై భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తరుణంలో మలిక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. ఇక తాజాగా సమాచార శాఖ మంత్రి అట్టావుల్లా తరార్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ముసాదిక్ మలిక్ మాట్లాడుతూ.. “మా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతినే నరికేస్తామని మేము ఇప్పటికే ప్రకటించాం. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, గత ఒకటిన్నర రెండేళ్లలో రెండుసార్లు ఆచరణలో చూపించాం కూడా. మమ్మల్ని మేము కాపాడుకోగలమని రెండుసార్లు నిరూపించాం.. అయితే ఎగువన ఉన్న దేశాలు, దిగువన ఉన్న దేశాల నీటిని ఆపేసే హక్కును ప్రపంచం వారికి ఇచ్చేసిందా?” అంటూ భారత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారం తమకు వచ్చే నీటిని రక్షించుకోవడానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని, నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భారత్‌కు అనుమతినిచ్చేది లేదని మలిక్ స్పష్టం చేశారు.
అసలు భారత్ తీసుకున్న నిర్ణయం ఏమిటి?
పాక్ మంత్రి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఓ బాధిత దేశంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడ అసలు వాస్తవం ఏమిటంటే, భారత్ సింధు నది నీటిని పూర్తిగా నిలిపివేయలేదు. సింధు నది, దాని ఉపనదుల నీటి ప్రవాహం ఇప్పటికీ యథావిధిగా పాకిస్థాన్ వైపు సాగుతోంది. భారత్ కేవలం సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు అందుతున్న ‘సపోర్ట్ సిస్టమ్’ (సహాయక వ్యవస్థ)ను మాత్రమే నిలిపివేసింది. సాధారణంగా నదీ జలాల ప్రవాహం, ఆనకట్టల (డ్యామ్‌ల) నిర్మాణం, ప్రాజెక్టులు, నీటి నిర్వహణకు సంబంధించి ఇరు దేశాల మధ్య నిరంతరం సమాచార మార్పిడి, చర్చలు జరుగుతుండేవి. ఇప్పుడు భారత్ ఈ చర్చలను, సమాచార మార్పిడి వ్యవస్థను పూర్తిగా నిలిపివేసి పాక్‌కు షాక్ ఇచ్చింది.
సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు నది, దాని ఉపనదుల నీటి పంపిణీ కోసం 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంక్ (వరల్డ్ బ్యాంక్) మధ్యవర్తిత్వంతో ఈ చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఏ నది నీటిని ఏ దేశం ఉపయోగించుకోవాలి, ఎవరి వాటా ఎంత అనేది స్పష్టంగా నిర్ణయించారు. 1960 నుంచి ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య నీటి పంపిణీని నియంత్రిస్తున్నది ఈ ఒప్పందమే. అయితే ఉగ్రవాద చర్యల నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఇప్పుడు పాకిస్థాన్ గిలగిలలాడుతోంది.

