Salman Khan – Pakistan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన పాకిస్థాన్ ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం (1997)లోని నాల్గవ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్ పేరును చేర్చినట్లు దాయాది దేశం స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల జాబితా ఇది. సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఈ జాబితాలో చేర్చడంతో ఆయన కార్యకలాపాలను దాయాది దేశం నిశితంగా పరిశీలిస్తుందని విశ్లేషకులు చెప్పారు.
పాకిస్థాన్‌లో ఆయన కదలికలను పరిమితం చేయవచ్చని, అలాగే ఆయనపై చట్టపరమైన చర్యలు కూడా దాయాది దేశం తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరం 2025లో సల్మాన్ ఖాన్ చేసిన ప్రకటన తర్వాత దాయాది దేశం నుంచి ఈ నిర్ణయం వచ్చింది. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో కలిసి జాయ్ ఫోరమ్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నప్పుడు.. ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో భాగం అయిన బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు. ఈక్రమంలో పాకిస్థాన్ సల్మాన్ ఖాన్ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.
అసలు ఏం జరిగిందంటే..
జాయ్ ఫోరంలో సల్మాన్ ఖాన్ హిందీ సినిమాల గురించి మాట్లాడుతూ.. బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా అభివర్ణించారు. “ప్రస్తుతం ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఒక తమిళ, తెలుగు లేదా మలయాళ సినిమా తీస్తే, అది కూడా వందల కోట్ల విలువైన వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. బలూచిస్థాన్ నుంచి వచ్చిన ప్రజలు, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు, పాకిస్థాన్ ప్రజలు … అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు” అని అన్నారు. వాస్తవానికి సల్మాన్ ఖాన్ ప్రకటన పాకిస్థాన్‌లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం స్పందించి ఆయనను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్ ప్రభుత్వం ఆయన పేరును ఉగ్రవాద నిరోధక చట్టం (1997)లోని నాల్గవ షెడ్యూల్‌లో చేర్చింది.
READ ALSO: Donald Trump: మలేషియాలో డాన్స్ చేసిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (వీడియో)