వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. లాహోర్ వేదికగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ (76), ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు.
ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ ఇంత వేగంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఇంగ్లండ్‌పై ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్ తొలి 10 ఓవర్లలో ఒక వికెట్‌కు 51 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిదిలు పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
Also Read: TS Govt: నేడు సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయనున్న ప్రభుత్వం.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ దొరికేనా?
తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (93), షాన్ మసూద్ (76) హాఫ్ సెంచరీలు చేశారు. ఆపై మహ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) లు సైతం అర్ధ సెంచరీలు బాదారు. అబ్దుల్లా షఫీక్ 2 పరుగులే చేయగా.. సౌద్ షకీల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. బాబర్ అజామ్ (23)కు లైఫ్ దొరికినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండోరోజు రిజ్వాన్, అఘాలు చెలరేగితే పాక్ భారీ స్కోర్ చేయడం పక్కా.