Highest Innings Totals in Tests: టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడడం ఇది మూడోసారి. 1938లో ఆస్ట్రేలియాపై 903/7 స్కోర్ చేసింది. 1930లో వెస్టిండీస్‌పై 849 పరుగులు చేసింది. తాజాగా పాకిస్థాన్‌పై 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో టాప్ 5లో మూడు స్థానాలు ఇంగ్లీష్ జట్టువే కావడం విశేషం. ఈ జాబితాలో శ్రీలంక (1997లో టీమిండియాపై 952/6) అగ్ర స్థానంలో ఉంది. ఒక జట్టు 800 స్కోరు అధిగమించడం ఈ శతాబ్దంలో ఇదే మొదటిసారి.
ఓవర్‌నైట్ స్కోరు 492/3తో నాలుగో రోజైన గురువారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. 150 ఓవర్లలో 823/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆటలో 49 ఓవర్లలో 331 పరుగులు చేయడం విశేషం. జో రూట్ (262; 375 బంతుల్లో 17×4) డబుల్ సెంచరీ, హ్యారీ బ్రూక్ (317; 322 బంతుల్లో 29×4, 3×6) ట్రిపుల్ సెంచరీలతో చెలరేగడంతో పరుగుల వరద పారింది. ముఖ్యంగా బ్రూక్ వన్డే మాదిరి ఆడడంతో ఇంగ్లీష్ టీమ్ భారీ స్కోర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు 800 స్కోరు అధిగమించడం ఇది నాలుగోసారి.
Also Read: Unstoppable-NBK: ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ గెస్ట్‌గా స్టార్ హీరో.. ఆ పుకార్లకు సమాధానం చెప్పాడా?
జో రూట్, హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. టెస్ట్ చరిత్రలో మాత్రం నాలుగోది. 2006లో దక్షిణాఫ్రికాపై కుమార సంగక్కర, మహేల జయవర్దనె భాగస్వామ్యం (624) అగ్ర స్థానంలో ఉంది. ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు జాబితాలో బ్రూక్ 20వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ రాబట్టిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. బంతుల పరంగా ట్రిపుల్ సెంచరీ అత్యంత వేగంగా సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.