Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న నాయకుడిగా నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన వాగ్వాదాలు, వారిపై సవాళ్లు విసిరి ప్రాచుర్యంలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో జరిగిన అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ వివాదం చర్చనీయాంశంగా ఉండగానే, కౌశిక్ రెడ్డి మరో సమస్యలో చిక్కుకున్నారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మరో ఫిర్యాదు చేసారు.
ఫిర్యాదులో, గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపును రాష్ట్ర ప్రభుత్వానికి బలవంతంగా ముడిపెట్టి, సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై పోలీసులు స్పందించి ఫిర్యాదును స్వీకరించారని, కేసు నమోదు చేసే విషయంలో పరిశీలన జరుగుతోందని సమాచారం.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విధానాలు, వ్యాఖ్యలు వరుసగా వివాదాలకు దారితీయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ తన మాటలతో వివాదాలను సృష్టించిన ఆయన, మరోసారి ప్రతిపక్ష పార్టీ నేతల ఆగ్రహానికి గురవడం, ఫిర్యాదుల పాలవడం ద్వారా తన రాజకీయ ప్రయాణంలో మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇవేవి ఉన్నా, కౌశిక్ రెడ్డిపై నమోదవుతున్న కేసులు, ఆరోపణలు భవిష్యత్‌లో ఆయనపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Bhatti Vikramarka: తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు..