ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడుల సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఫస్ట్ వాటర్ బెల్, 11 గంటలకు సెకండ్ వాటర్ బెల్, 12 గంటలకు థర్డ్ వాటర్ బెల్ మోగించాలని సూచించారు. వాటర్ బెల్ సందర్బంగా టీచర్లు తరగతులు నిలుపుదల చేసి వెంటనే విద్యార్ధులు వాటర్ తాగేవరకు చూడాలని ఆదేశించారు.
Also Read:India On USCIRF: మైనారిటీలపై యూఎస్ నివేదిక.. భారత్ తీవ్ర ఆగ్రహం..
వాటర్ బాటిల్ తెచ్చుకోని వారికి స్కూల్లో ఆర్ ఓ సిస్టమ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. డ్రింక్ వాటర్ ఎవ్రీ అవర్ …స్టే కూల్, స్టే సేఫ్ పేరుతో పోస్టర్లను క్లాస్ రూముల్లో, వాటర్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఎండల వేళ విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు పాఠశాలల్లో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.