NTV Telugu Site icon

Waqf Bill: ఇలా చేస్తే జేపీసీ నుంచి తప్పుకుంటాం.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపీలు..

Mps

Mps

వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్‌ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన ఇతర కమిటీ సభ్యులను సంప్రదించకుండా మూడు రోజుల సెషన్ నిర్వహిస్తున్నారని, ఇది సరైన పద్దతి కారదని తెలిపారు. పారదర్శకతను పాటించడం లేదని, దీని వల్ల ప్యానెల్ ఉద్దేశం దెబ్బతినే చాన్స్ ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష ఎంపీలు బిర్లాను కలవవచ్చు..
విపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో కమిటీ కార్యకలాపాల్లో తాము వినలేదని, అటువంటి పరిస్థితిలో తాము కమిటీ నుంచి వైదొలగవలసి రావచ్చని పేర్కొన్నారు. మంగళవారం బిర్లాను కలుసుకుని ఫిర్యాదుల గురించి వివరించవచ్చని ప్రతిపక్షాలకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. డీఎంకే ఎంపీ ఏ రాజా, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, ఏఐఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సహా ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్‌కు ఉమ్మడి లేఖ రాశారు.

జగదాంబిక పాల్‌పై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి?
సమావేశాల తేదీలను నిర్ణయించడంలో, కొన్నిసార్లు వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించడంలో, కమిటీ ముందు ఎవరిని పిలవాలో నిర్ణయించడంలో, సీనియర్ బిజెపి ఎంపీ జగదాంబిక పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సన్నద్ధత లేకుండా ఎంపీలు చర్చలు జరపడం ఆచరణ సాధ్యం కాదన్నారు. విధివిధానాలను దాటవేసి, ప్రభుత్వ ఇష్టానుసారం ప్రతిపాదిత చట్టాన్ని ఆమోదించే సాధనంగా కమిటీని చూడకూడదని ప్రతిపక్ష సభ్యులు లేఖలో ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా తమ పనికి అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అనుమతించలేదన్న ఆరోపణలను పాల్ తోసిపుచ్చారు. అందరికీ వినిపించేలా చూసుకున్నానని చెప్పారు.