ONGC Gas Leak: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సమీపంలో ఉన్న ఓఎన్‌జిసి (ONGC) గ్యాస్ బావిలో లీక్ జరగడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ కలిసిన గ్యాస్ ఎగజిమ్మింది. ఉత్పత్తిలో ఉన్న బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్ ద్వారా మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
మొదట గ్యాస్ గ్రామమంతా వ్యాపించి, ఉదయం పొగమంచును తలపించే విధంగా తెల్లటి గ్యాస్ మేఘాలు ఇరుసుమండను కమ్మేశాయి. ముఖ్యంగా కొబ్బరి తోటలు, పంట పొలాల మీదుగా గ్యాస్ విస్తరించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ లీక్‌కు కొద్ది సేపటికి మంటలు అంటుకోవడంతో ఆకాశాన్ని తాకేలా అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందన్న అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!
గ్రామంలో ఎవరూ ఇళ్లలో ఉండకూడదని, వెంటనే బయటకు రావాలని పంచాయతీ అధికారులు మైక్ ద్వారా ప్రత్యేక అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలను లక్కవరం కళ్యాణ మండపానికి తరలిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని సగానికి పైగా నివాసాలను ఖాళీ చేయించినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో పాటు ONGC సాంకేతిక బృందాలు లీక్‌ను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి.