హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఓ కాలేజీ యాజమాన్యం ఆటలాడుతోంది. విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకొని మరీ.. యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదు. పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి.. ఎగ్జామ్ రోజున విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని మరలా ఇంటి దగ్గరే దింపారు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడంతో.. కాలేజీ యాజమాన్యం 9 మంది విద్యార్థులు దగ్గర ఫీజులు కట్టించుకుంది. హాల్ టికెట్ అడిగితే.. పరీక్ష రోజు ఇస్తామని చెప్పింది. తీరా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రోజున విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని.. మరలా ఇంటి దగ్గరే టీచర్స్ దింపేశారు. దాంతో స్టూడెంట్స్ షాక్ తిన్నారు. విషయం వారి తల్లిదండ్రులకు చెప్పారు.
కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న కాలేజీ బస్సులు అడ్డుకున్నారు. ఫీజు కట్టక కూడా.. విద్యార్థులను ఎందుకు పరీక్ష రాయించలేదని ప్రశ్నించారు. దాంతో టీచర్స్, పేరెంట్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసులు నచ్చ చెప్పడంతో.. టీచర్స్ మిగతా విద్యార్థులను ఎగ్జామ్ రాయించడానికి తీసుకువెళ్లారు. పోలీసులు అడిగితే.. కాలేజ్ యాజమాన్యం కారణాలు చెప్పకుండా బుకాయిస్తోంది. ఏదేమైనా 9 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.