సినిమా టికెట్ల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న ఈ రోజుల్లో, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం ‘వన్ ప్లస్ వన్’ (Buy 1 Get 1 Free) ఆఫర్‌ను ప్రకటించారు. ముఖ్యంగా జంటగా వచ్చే వారికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్లలో కేవలం రూ. 99, మల్టీప్లెక్స్‌లలో రూ. 150గా టికెట్ ధరలను నిర్ణయించి వార్తల్లో నిలిచిన మేకర్స్, ఇప్పుడు ఈ ఆఫర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : Preeti Mukundhan : బాలీవుడ్‌లోకి ‘కన్నప్ప’ బ్యూటీ..
జనవరి 29న నిర్వహించనున్న పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అగనంపూడి, అమలాపురం, మచిలీపట్నం, అనంతపురంలోని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో సృజన్ యారబోలు నిర్మించారు. భార్యపై ఆధిపత్యం ప్రదర్శించే భర్తకు ఆమె ఎలా బుద్ధి చెప్పింది అనే కామెడీ ఎమోషనల్ డ్రామాతో ఈ చిత్రం రూపొందింది. తెలంగాణ యాసలో మెప్పించే తరుణ్ భాస్కర్, ఈ సినిమాలో తొలిసారి గోదావరి యాసలో కనిపించనుండటం విశేషం. మధ్యతరగతి కుటుంబాలకు ఈ తక్కువ ధరలు, ఆఫర్లు సినిమాను మరింత చేరువ చేస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.