వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? వివరణల మీద వివరణలు ఇచ్చుకోలేక సతమతం అవుతోందా? మేం బిల్లుకు అనుకూలమేగానీ… అన్యాయం జరక్కుండా సవరణలు ప్రతిపాదించి సక్సెస్ అయ్యామన్న టీడీపీ స్టేట్‌మెంట్స్ ప్రతిపక్ష పార్టీ మీద ప్రెజర్ పెంచుతున్నాయా? అసలు బిల్లు విషయమై ఏపీలో ఏం జరుగుతోంది? వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బిల్లు విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటోంది టీడీపీ. బిల్లును వ్యతిరేకిస్తున్నామని ముందు ప్రకటనలు చేసి… అదే బిల్లుకు రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇచ్చిందని.. ఇది జగన్ మార్క్ డబుల్ గేమ్ అంటున్నారు తెలుగుదేశం లీడర్స్. అందుకు వైసీపీ వైపు నుంచి కౌంటర్ చేసుకునేందుకు తంటాలు పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. వక్ఫ్ బిల్లుకు తాము అనుకూలమని ముందే ప్రకటించిన టీడీపీ అందుకు తమవంతుగా కొన్ని సవరణలను ప్రతిపాదించింది. పార్లమెంటులో కూడా ఆ మేరకే వ్యవహరించింది. అదే సమయంలో బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పిన వైసీపీ.. లోక్ సభలో ఒక రకంగా, రాజ్యసభలో మరో రకంగా వ్యవహరించిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది టీడీపీ. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే ఆ పార్టీ నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ… రాజ్యసభలో తేడా చేశారన్నది అధికార పార్టీ మాట. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. కానీ…ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు మాత్రం అనుకూలంగా ఓటేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ… ఓటింగ్ ముగిశాక వైసీపీ విప్ జారీ చేసిందని, అది ముస్లింలను మోసం చేయడానికి జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ కాదా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. అయితే అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలని, బిల్లును తాము వ్యతిరేకించామనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన కార్యకలాపాలే సాక్ష్యమని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. పలువురు వైసీపీ నేతలు కూడా మీడియా సమావేశాలు పెట్టి వక్ఫ్ బిల్లు విషయంలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ… ఈ విషయంలో మాత్రం టీడీపీ చేస్తున్న పొలిటికల్ అటాక్‌కు వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. డైరెక్ట్‌గా ఉభయ సభల్లో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి స్పష్టమైన వైఖరి ప్రకటించడమేగాక… ముస్లింలకు అన్యాయం జరక్కుండా, భవిష్యత్‌లో కూడా వారికి ఇబ్బందులు రాకుండా తమవైపు నుంచి కొన్ని కొన్ని సవరణలు ప్రతిపాదించి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు టీడీపీ నాయకులు.
అసలు.. గత ఎన్నికల సమయంలో ఎన్డీఏలో చేరాలని వైసీపీ పెద్దలకు మనసు పీకినా….తాము ఓట్ బ్యాంక్‌గా భావించే ముస్లిం దూరమవుతారన్న కారణంతోనే చేరలేదంటూ కామెంట్స్ చేస్తున్నారట టీడీపీ ముఖ్యులు. అయినా… ముస్లింలకు టీడీపీ మీద నమ్మకం ఉంది కాబట్టే…. గత ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలను కూటమి బద్దలు కొట్టిందని, తెలుగుదేశం హయాంలో వాళ్ళకు ఎప్పటికీ అన్యాయం జరగదని అంటున్నారు సైకిల్ పార్టీ నాయకులు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్స్ మధ్య యుద్ధం నడుస్తోంది. బిల్లును వ్యతిరేకించిన మైలేజ్ కోసం వైసీపీ.. అనుకూలంగా ఉన్నాసరే… సవరణలు సూచించి సక్సెస్ అయ్యామంటూ వ్యతిరేకత ప్రభావం తమపై పడకుండా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటుండటంతో…మేటర్ మాంఛి రసకందాయంలో పడుతోంది. అయితే ఈ విషయంలో జనసేన మాత్రం వేలు పెట్టడంలేదు. కేవలం బిల్లుకు తాము అనుకూలమని చెప్పుకొచ్చేవరకే పరిమితం అయింది గ్లాస్ పార్టీ. ఈ ప్రచారాలు, సోషల్ యుద్ధాల్లో ఎవరిది పైచేయి అవుతుంది, ప్రజలు ఎవర్ని నమ్ముతారన్నది తేలాలంటే… ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.