ఆ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారా? గెలిచి 9నెలలవుతున్నా…. ఏం చేయలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారా? చివరికి తప్పు చేసిన వారిని శిక్షించలేకపోయానన్న బాధ ఆయనలో పెరిగిపోతోందా? అసలాయన ఏమన్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…2019లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీని వీడి టీడీపీ బీఫాం మీద పోటీ చేసిన వెంకట్రావు తనను ఓడించిన వంశీపై రివెంజ్ తీర్చుకున్నారు. వంశీ 2019లో టీడీపీ నుంచి గెలిచినా…. అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి జైకొట్టారు. వంశీ వైసీపీలోకి రావటాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన యార్లగడ్డ వెంకట్రావు అదే విషయాన్ని జగన్ కు చెప్పటంతోపాటు వంశీతో కలిసి పని చేసేందుకు ససేమిరా అన్నారు. అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కింది. తన ఏలుబడిలో ఆ బ్యాంకును లాభాల బాటపట్టించారాయన. అప్పట్లో రైతులకు మేలు చేయడంతోపాటు… బ్యాంకు సిబ్బంది కొందరు పెట్టే వృధా ఖర్చులను అడ్డుకున్నారట. సీన్ కట్ చేస్తే…. 13 నెలలకు ఆ పదవి నుంచి తప్పుకున్నారు యార్లగడ్డ. తర్వాత పార్టీ మారడం, టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి. అయితే… యార్లగడ్డ కేడీసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక…. అప్పటిదాకా ఆయన కట్టడి చేసిన వాళ్ళంతా కట్లు తెంచుకున్నారని, అనేత అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.బ్యాంకు డబ్బు కొల్లగొడుతున్నారని, సీఆర్డీయే అనుమతులు లేకుండా కమీషన్ల కోసం అవసరంలేని గోడౌన్స్‌ని కట్టారని గుర్తించారట వెంకట్రావు. దానిపై దర్యాప్తు జరిపించమని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని కోరగా… నిరుడు నవంబర్‌లో అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని, అయినాసరే… ఇంతవరకు దర్యాప్తు మొదలవలేదన్న అసహనం ఎమ్మెల్యేకు పెరుగుతోందట. పీఏసీఎస్ లలో సెక్రటరీ వ్యవస్థను మార్చాలని, జీఓ 90ని అమలు చేయాలని, ఆంధ్రా బ్యాంకు మూసేటపుడు తీసేసిన సాఫ్ట్ వేర్ ను ఆప్కాబ్ కొనటంలో స్కామ్ జరిగిందని, వాటి మీద దర్యాప్తు జరిపించమని కోరినా…. ఎవ్వకూ స్పందించకపోగా…. గతంలో ఉన్న అధికారులు, సిబ్బంది ఇప్పటికీ అక్కడే విధుల్లో ఉండటం ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అదే విషయాన్ని యార్లగడ్డ అసెంబ్లీ వేదిక నుంచి ఘాటుగానే చెప్పటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరలై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారాయి. ఎమ్మెల్యే అయ్యాక వీటి మీద ఏదో చేద్దామని అనుకున్నానని, కానీ ఏం చేయలేకపోతున్నానని ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఏంటని అసెంబ్లీలో యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ చేయిస్తుందా? చేయిస్తే…. ఎప్పటికి పూర్తవుతుందన్నది ఆయన క్వశ్చన్. కూటమి ఎమ్మెల్యేలు చాలామందిలో ఇదే అభిప్రాయం ఉన్నా… ఎవ్వరూ బయటపడటంలేదని చెప్పుకుంటున్నారు.
అయితే… యార్లగడ్డ వెంకట్రావు మాటల్లో ఆవేదన కర్టక్టే అయినప్పటికీ ఆయన వ్యక్తపరుస్తున్న తీరుపైనే ఇప్పుడు చర్చ జరుగుతోందట టీడీపీ సర్కిల్స్‌లో. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే….వెంకట్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం స్పందించటం లేదనే ధోరణితో మాట్లాడటం నెగిటివ్ అవుతుందనే చర్చ జరుగుతోందట టీడీపీలో. కేడీసీసీ బ్యాంక్ అక్రమాలపై యార్లగడ్డ చేసినవ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే… కొందరు దాన్ని నైస్‌గా ఎడిట్ చేసి…కేడీసీసీ బ్యాంక్ ప్రస్తావన లేకుండా అసలు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని యార్లగడ్డ ఆవేదన చెందుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారట. ఆ ఎడిటింగ్ బ్యాచ్ సంగతి ఎలా ఉన్నా…. ఎమ్మెల్యే మాత్రం కేడీసీసీ బ్యాంక్‌కు సంబంధించి అయినాసరే… ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీని ఇరుకున పెడుతోందని అంటున్నారు. మరోవైపు యార్లగడ్డ ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా బదులిస్తూ ఎమ్మెల్యేలు చెప్పారని, మీడియాలో వచ్చిందని వెంటనే చర్యలు తీసుకోలేమని అలా చేస్తే… సిబ్బంది కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకువచ్చి పూర్తిగా అడ్డుకుంటున్నారని చెప్పుకోచ్చారు. అధికారులతో మొదట విచారణ జరిపి ఆ తర్వాత చర్యలుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు సమాధానానికి యార్లగడ్డ సంతృప్తి చెందారో లేక మళ్ళీ స్పందిస్తారో చూడాలి.