ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుంది? ముందు ఒక ఊపు ఊగినా… తర్వాత వ్యవహారం ఎందుకు చప్పున చల్లారింది? వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమేనా? ఫస్ట్ టైం ఈ ఫార్మాట్‌లోకి వచ్చిన సత్తిబాబు తనదైన శైలిలో పావులు కదిపారా? ఇదంతా ఆయన చాణక్యమా లేక టీడీపీ రాజకీయ నిబద్ధత నిలబడిందా? బొత్స సత్యనారాయణ….తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన పోటీలో వుంటే ప్రత్యర్ధుల బలంకంటే ఈ మాజీ మంత్రి వ్యూహరచన మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దండుడుగా గుర్తింపు ఉన్న బొత్స సత్తిబాబు ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అది కూడా తాన సొంత జిల్లా విజయనగరం నుంచి కాకుండా విశాఖ జిల్లా కోటా నుంచి కావడంతో మరింత ఆసక్తి పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టడం లాంఛనమేనంటున్నారు. ఇది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో… వాస్తవంగా అయితే వైసీపీకి టెన్షన్ అక్కర్లేదు. అందులో ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రతినిధుల బలం కావాల్సినంత ఉంది. కానీ… రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పోటీ పెడుతుందన్న కంగారు మొదట్లో వైసీపీ శిబిరంలో కనిపించిందట. కానీ..బొత్స అభ్యర్ధిత్వం ఖరారు తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నది ఇంటర్నల్ టాక్. అదే సమయంలో ఓటింగ్ బలం లేనప్పుడు పోటీ పెట్టడం రాజకీయ విలువలకు విరుద్ధమన్న చర్చ గట్టిగానే జరిగింది టీడీపీ శిబిరంలో. ఆ దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని తాము పోటీ చేయబోవడం లేదని చెప్పేసింది టీడీపీ అధిష్టానం. దీంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సరికి రెండే దాఖలయ్యాయి. అందులో ఒకటి బొత్సది కాగా… మరొకరు స్వతంత్ర అభ్యర్థి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ పోరా హోరీగా జరుగుతుందని అంతా ఊహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా నాయకత్వానికి టచ్ లోకి రావడం, ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి. కీడెంచి మేలు ఎంచాలనుకున్న వైసీపీ.. తమ ఎంపీటీసీలు, జడ్పిటిసి లను క్యాంపులకు తరలించింది. దీంతో ఎమ్మెల్సీ పోరు హోరాహోరీగా మారుతుందని, ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుందన్న లెక్కలు వాతావరణాన్ని వేడెక్కించాయి.
ఇటీవల గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్ధాయి మెజారిటీ వున్నా 10కి 10 టీడీపీ కూటమి చేజిక్కుంచుకోవడంతో ఎమ్మెల్సీ పోటీ అదే స్ధాయిలో వుంటుందని ఊహించారు. ఇలాంటి వాతావరణంలో విలువలతో కూడిన రాజకీయానికి కట్టుబడి తన నిర్ణయాన్ని మార్చుకుందట టీడీపీ. సంఖ్యాబలం లేదన్న కారణంతో ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఎక్కడ వరకు పైకి అన్నీ… రాజకీయ కారణాలే కనిపిస్తున్నప్పటికీ దీని వెనక బొత్స సత్యనారాయణ చాణక్యం కూడా ఉందన్నది వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అనూహ్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బొత్స…. మొదటి రోజు నుంచి దూకుడు ప్రదర్శించారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల పేరుతో నాయకత్వాన్ని సమీకరించడం, సార్వత్రిక ఎన్నికల తర్వాత వారిలో కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేయగలిగారట. సందిగ్ధంలో ఉన్న ఓటర్లను గుర్తించడం., వారిని విహార యాత్రల పేరుతో రాష్ట్రం దాటించేయడం సత్తిబాబు ప్లానింగ్‌లో భాగం అంటున్నారు.వాస్తవానికి ప్రచారం ప్రారంభించిన రెండో రోజు నుంచే ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించిందంటున్నారు దగ్గరగా గమనించిన వారు. దీంతో ఏదో జరగబోతోందనే సమాచారం ఆయనకు ముందుగానే వుందన్న అభిప్రాయం బలపడుతోంది. ఆ దిశగా పై నుంచి నరుక్కుని రావడంలోనూ సక్సెస్ అయ్యారన్నది సన్నిహిత వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఫలితం ఎవరికి అనుకూలంగా వచ్చినా… రెండోవాళ్ళకు పెద్ద డ్యామేజ్ తప్పదు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల మెజార్టీ వైసీపీకే ఉన్నందున ఇప్పుడు ఎన్నిక జరిగి ఒకవేళ టీడీపీ గెలిచినా… కనీస నైతికత లేకుండా ఓటర్లను కొనేశారన్న అపవాదును భరించాల్సి ఉంటుంది. అంతకు మించి పార్టీలకు అతీతంగా బొత్సకు సత్సంబంధాలు వున్నాయి. వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ. పైగా, ఎమ్మెల్సీగా ఎన్నికైతే కీలకమైన మండలి విపక్షనేత పదవి దక్కవచ్చనే అంచనాలు వున్నాయి. ఇవన్నీ ఏకమైనప్పుడు బొత్సను ఓడించడం ద్వారా వచ్చే లాభం కంటే నెగెటివ్ ఫలితం వస్తే ఎదురయ్యే పరిణామాలు ఎక్కువని టీడీపీ నాయకత్వం ఆలోచించినట్టు ప్రచారం ఉంది. ఇలా రకరకాల అంశాలు కలిసి వచ్చి…బొత్స సత్యనారాయణ ఇక ఎమ్మెల్సీగా ఎన్నికవడం లాంఛనమేనన్నది పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న టాక్.