ఆవులు ఆవులు పొడుచుకుంటే…. మధ్యలో దూడలు నలిగిపోయినట్టుగా అక్కడి రాజకీయం మారిందా? రాష్ట్ర స్థాయి హయ్యెస్ట్ పోస్టుల్లో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనడం సెగలు పుట్టిస్తోందా? ఎవరికి వారు ప్రోటోకాల్‌తో కొట్టే ప్రయత్నం చేయడం రక్తి కట్టిస్తోందా? ఎవరా ఇద్దరు? ఏంటా పోటీ రాజకీయం? జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు వ్యవహారం… నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య అగ్గి రాజేసిందట. ఈ విషయంలో పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తుండటం ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు దగ్గరగా గమనిస్తున్నవారు. తనకు తెలియకుండా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు పంపడం, వాటిని ఆయన ఆమోదించడంపై చాలా సీరియస్‌గా ఉన్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా చెప్పాలంటే ఆ వ్యవహారం ప్రస్తావనకు వస్తేనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. మేటర్‌ని మంత్రి అంత సీరియస్‌గా తీసుకోవడంతో… అలర్ట్ అయిన కలెక్టర్… త్రిపాఠి తాను ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని రద్దు చేశారు. అయితే… అక్కడే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కాలిపోయిందట. తన ప్రతిపాదనలకు సంబంధించిన ప్రోసిడింగ్స్‌ను కలెక్టర్ రద్దు చేయడాన్ని గుత్తా సీరియస్‌గా తీసుకున్నారట. దీంతో కార్చిచ్చుకు.. వడగాడ్పులు తోడైనట్టుగా మారిపోయిందట జిల్లా రాజకీయం. కొంత కాలంగా ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయం… ఉపాధి హామీ పనుల ప్రొసిడింగ్స్‌తో రచ్చకెక్కిందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.ఈ క్రమంలోనే పనుల రద్దుపై వివరణ కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇవ్వడం, స్వయంగా మండలి ఛైర్మన్ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టయిందని మాట్లాడుకుంటున్నాయి జిల్లా అధికార వర్గాలు. తనకు తెలియకుండా తన జిల్లాలో పనులు ప్రతిపాదించడం, వాటిని ఆమోదించడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్సలు సహించలేకపోతున్నారట. ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కూడా తన స్ట్రైల్లో అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఆ దెబ్బకే ప్రొసీడింగ్స్ రద్దయినట్టు సమాచారం. అయితే… ఎమ్మెల్సీగా తన పరిధిలో, తనకు ఉన్న అధికారంతో ఎక్కడైనా పనులను ప్రతిపాదించే హక్కు ఉందని గుత్తా గట్టిగానే వాదిస్తున్నారట. అదే సమయంలో తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తన అనుచరుల పట్ల మంత్రి, ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇక తాజా ఎపిసోడ్‌తో ఆయన కూడా తాడోపేడో తేల్చుకొవడానికి సిద్ధమైనట్టు సమాచారం. మంత్రి కూడా తనకు తెలియకుండా జిల్లాలో పనులు ప్రతిపాదిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుండటంతో ఇద్దరి మధ్య పోరు అధికారులకు తలనొప్పిగా మారింది. ఒకరు క్యాబినెట్‌లో కీలక మంత్రి, మరొకరు శాసనమండలి చైర్మన్ కావడంతో…వాళ్ళకు ఉండే ప్రోటోకాల్.. వాళ్ళ నుంచి వచ్చే ఆదేశాలు పాటించే విషయం అధికారులకు కత్తిమీద సాములా మారుతోందని అంటున్నారు. ఇద్దర్నీ సమన్వయం చేసుకుంటూ నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా వెళ్తున్నా… ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయంటూ తలలు పట్టుకుంటోందట యంత్రాంగం. చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతూనే… విధులు నిర్వహిస్తున్నామంటున్నారు అధికారులు.. ఇద్దరు నేతల దూకుడు, వ్యవహార శైలితో కొన్ని సందర్భాలలో ఆఫీసర్స్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారుతోందన్న చర్చ జిల్లా ఉద్యోగవర్గాల్లో జరుగుతోంది. మండలి చైర్మన్ గా తన హోదాతో గుత్తా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండగా… అంతకుమించి అన్నట్లు వ్యవహరిస్తున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో నల్గొండ హస్తం పార్టీలో ఎప్పటికప్పుడు పొగలు సెగలు రేగుతూనే ఉన్నాయి.