తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి అటా.. ఇటా..? ఎటు? ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధంగాని గందరగోళంలో ఉన్నారా? ఏంటి….? అసలేంటి… మాకీ ఖర్మ అంటూ పార్టీ నాయకులు తలలు బాదుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీ లీడర్స్‌కు అంత కష్టం ఏమొచ్చింది? క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్టుగా ఎందుకు ఫీలవుతున్నారు? పూటకో మాట, రోజుకో రూల్ అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళకు వాళ్ళే రూల్స్ పెట్టుకుంటారు. పాటించకుండా నీరుగార్చేది కూడా వాళ్ళే. ఈ క్రమంలో తాజాగా పదవుల విషయంలో పెట్టుకున్న నిబంధనతో పార్టీలో తీవ్ర చర్చతో పాటు గందరగోళం కూడా పెరుగుతోందని అంటున్నారు. 2017 నుంచి… పార్టీలో ఉన్న వారికే పదవులని ఒక మాట అంటారు. మరి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే… క్లారిటీ ఉండదు. సరే.. అధికారంలోకి వచ్చాక… పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల సంగతేంటంటే… అదీ పెద్ద క్వశ్చన్‌మార్కే. పెద్ద నాయకుల సంగతి ఎలా ఉన్నా… మండల, గ్రామ స్థాయి నాయకుల భవిష్యత్తు ఏంటన్నది ఇంకా బిగ్ క్వశ్చన్. ఇన్ని అనుమానాల మధ్య కాంగ్రెస్ కేడర్ ఊగిసలాడుతుంటే… నాయకులు మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారట. పార్టీలో ఎవరి పొజిషన్ ఏంటో… ఎవరికి ఏ పదవోనన్న విషయంలో కించిత్ క్లారిటీ కూడా లేక, ఎవరికి నచ్చిన ఊహాగానాలను వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసలు ఎక్కడ ఉన్నారో అర్ధం కావడం లేదన్న టాక్ పార్టీలో నడుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం పార్టీ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోందని, అది పూర్తవగానే… నామినేటెడ్ పదవుల జాతర మొదలవుతుందని చెబుతోంది కాంగ్రెస్‌లోని ఓ వర్గం. కానీ… ఈ ప్రచారాన్ని కూడా నమ్మడం లేదట ఎక్కువ మంది నాయకులు. ఇలాంటి వాటిని విని..విని విసిగిపోయామని, ఏదైనాసరే… లిస్ట్ బయటికి వచ్చేదాకా… నమ్మలేమని, ఆ వచ్చినప్పుడు చూద్దాంలే అంటున్నారట ఎక్కువ మంది. ఇదంతా ఒక ఎత్తు ఐతే… ఇప్పుడు మరో రకమైన సమస్య వచ్చి పడిందట. ఇక్కడ పార్టీ పదవి కోరుకునే వాళ్ళు కొందరు… నామినేట్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నది ఇంకొందరు.
ముందు పార్టీ పదవుల భర్తీ పై చర్చ జరుగుతున్న క్రమంలో….. నామినేటెడ్ ఆశావహుల్లో గందరగోళం పెరుగుతోందట. అక్కడే వాళ్ళకో పెద్ద చిక్కొచ్చి పడిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయబోతున్నారు. ఆ తర్వాతే నామినేటెడ్ వంతు. నామినేటెడ్ మీద ఆశలు పెట్టుకుని ముందొచ్చిన పార్టీ ఆఫర్‌ని వదులుకుంటే… తర్వాత కోరుకున్నది రాకుంటే… పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అవుతుందన్న భయాలు ఎక్కువ మందిలో ఉన్నట్టు తెలిసింది. పార్టీ పదవి వస్తుందా రాదా అన్న విషయాన్ని ఏదో రకంగా తెలుసుకోవచ్చుగానీ…. నామినేటెడ్ విషయంలో అలా ఉండదు కాబట్టి… ముందొచ్చిన పార్టీ ఆఫర్‌ని ఓకే చేయాలా? లేక ఏదైతే అదవుతుందని అనుకుంటూ నామినేటెడ్ వంతు వచ్చేదాకా వెయిట్ చేయాలా అన్న మీమాంసలో ఎక్కువ మంది ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్న వారికి… పార్టీలో పదవులు లేవన్నది తాజా రూల్. కానీ… వాళ్ళు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు, పీసీసీ కమిటీల్లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఎవరు ఎట్నుంచి వత్తిళ్ళు తీసుకు వస్తారో, మొహమాటాలకు పోయి రూల్స్‌ని పక్కన పెట్టి ఎంతమందికి రెండు పదవులు ఇవ్వాల్సి వస్తుందోనన్న చర్చ సైతం నడుస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌లో. ఆశల పల్లకిలో ఊరేగుతూ… ఎవరికి వారు గట్టిగా లాబీయింగ్ చేస్తుండటంతో…. గందరగోళం పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో ఇక పదవులు ఆశిస్తున్న వారి సంగతైతే చెప్పే పనేలేదు. గాంధీ భవన్‌లో పార్టీ పదవులు అడగాలా వద్దా అన్న విషయమై… కార్పొరేషన్ పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు గందరగోళంలో ఉన్నట్టు తెలిసింది. కార్పొరేషన్ చైర్మన్ పదవులపై కన్నేసినా… చివరికి అది రాకుంటే… ఎటూ కాకుండా పోతామన్నది ఎక్కువ మంది టెన్షన్‌గా తెలుస్తోంది. పోనీ… నామినేటెడ్ పదవి వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి అసలు ఎవరిని అడగాలో పాలుపోని స్థితి. ఒక అధికార పార్టీ ఇన్ని నెలలు పార్టీ కమిటీల్ని వేసుకోలేక పోవడం ఒక బాధ అయితే… ఇప్పుడు రెండు రకాల పోస్ట్‌లకు లింక్‌పెట్టి… ఏది వస్తుందో ఏది రాదో… తెలియని గందరగోళం పెరిగిపోవడం బహుశా ఇప్పుడే కావచ్చునేమోనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.