మా త్యాగాలకు మీరిచ్చే విలువ ఇదేనా? సర్దుబాటు పేరుతో మేం ఎప్పటికీ త్యాగరాజులుగానే మిగిలిపోవాల్నా? నిన్నగాక మొన్న వచ్చినవాళ్ళు పెత్తనాలు చేస్తుంటే…. ఐదేళ్ళు నానా తంటాలు పడి కేడర్‌ని నిలుపుకున్న మేం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ… చప్పట్లు కొట్టాల్నా? ఏంటీ మాకీ ఖర్మ అంటున్నారట కీలకమైన ఆ జిల్లాలోని టీడీపీ లీడర్స్. ఎక్కడుందా పరిస్థితి? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది? 2024 అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి గెలిచింది జనసేన. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల టీడీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందట. కష్టకాలంలో వెన్నంటి ఉండి కేడర్‌ని నిలబెట్టుకుంటే…. తీరా ఎన్నికల టైంలో పొత్తు పేరుతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు పార్టీ పవర్‌లో ఉన్నా… తమ చేతులు కట్టేసినట్టుగా ఉందని వాపోతున్నారట. ఓవైపు జనసేన ఎమ్మెల్యేలు హడావిడి చేస్తుంటే… తాము మాత్రం చేష్టలుడిగి చూస్తూ కూర్చోవాల్సి వస్తోందని అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. తిరిగి తాము కూడా జనంలో తిరగాలన్నా…. పార్టీ కేడర్‌ని నిలబెట్టుకోవాలన్నా…ప్రాధాన్యత ఉండే నామినేటెడ్ పోస్ట్‌లు కావాలని, ఆ పని మాత్రం జరగడం లేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు సమాచారం. సీటు త్యాగాలు చేసే సమయంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి తీరతామని పార్టీ పెద్దలంతా… తెగ భరోసాలు ఇచ్చేశారని, తొమ్మిది నెలలు గడిచినా ఆ ఊసే లేకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు. మేమిలా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా అన్నది వాళ్ళ క్వశ్చన్. ఉగాది నాటికి అందరికీ న్యాయం చేస్తామని పార్టీ అధినేత హామీ ఇవ్వడంతో నాయకులంతా ఆసక్తిగా ఎదురు చూశారట. ఉగాది పోయింది… శ్రీరామ నవమి వస్తోంది. అయినా ఆ వాసన కూడా రాక ఉసూరుమంటున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, ఉంగుటూరు, నిడదవోలు, నరసాపురం,భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగిరింది. ఈ ఆరు చోట్ల త్యాగాలు చేసిన టిడిపి ఇంఛార్జిల్లో ఒక్క పోలవరం నియోజకవర్గ ఇంఛార్జికి మాత్రమే ఏపీ ట్రైకార్ చైర్మన్ పోస్ట్ దక్కింది. మిగిలిన ఐదు చోట్ల నేతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. మొదట ఉంగుటూరు నుంచి పోటీ చేయాలనుకున్న టీడీపీ ఫైనల్‌గా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించి… అక్కడి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజును గెలిపించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు అప్పగించింది.
ప్రతిగా ఆయనకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ, లేదా అత్యంత గౌరవమైన పదవి కట్టబెట్టడమే కాకుండా… అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చెప్పారట టీడీపీ పెద్దలు. దాంతో అప్పటి నుంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు గన్ని. ఒకప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగి పార్టీనే నమ్ముకున్న మాజీ మంత్రి జవహర్‌కు సముచిత స్థానం కల్పించడమే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇస్తారని మొదటి నుంచి భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం కన్వీనర్ వలవల బాబ్జీ, నరసాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశించిన పార్టీ కన్వీనర్ రామరాజు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడుకి,నిడదవోలు నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సైతంఅధికారం లోకి వచ్చిన వెంటనే మంచి పదవులు ఇస్తామని భరోసా ఇచ్చిందట టీడీపీ అధిష్టానం. కానీ… వీళ్ళలో ఎవరికీ ఇప్పటిదాకా ఏ పదవీ రాలేదు. దాంతో… పొత్తు ధర్మానికి కట్టుబడి పోటీ నుంచి వైదొలిగినందుకు మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ తీవ్ర అసహనం పెరుగుతోందట సదరు లీడర్స్‌లో. అదే సమయంలో…. తర్వాతి జాబితాలోనైనా న్యాయం చేస్తారా? లేక ఈసారికింతే… అలా సర్దుకుపోండని చావు కబురు చల్లగా చెబుతురా అన్న టెన్షన్ పెరుగుతున్నట్టు చెబుతున్నారు నేతల సన్నిహితులు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 20 మందిదాకా సీనియర్లు వివిధ కార్పొరేషన్స్‌లో పదవులు ఆశిస్తున్నారు. ఎవరికి వారే నెక్స్ట్ లిస్ట్ అంటూ ఆశగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు….నిత్యం యుద్ధం చేశామని, అక్రమ కేసులకు భయపడకుండా పనిచేసినా….చివరికి దక్కే గౌరవం ఇదేనా అంటూ కొందరు నాయకులు లోలోపల కుమిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. త్యాగరాజులకు అవకాశాలు వస్తాయా? లేక పార్టీ పెద్దలు సారీతో సరిపెడతారా అన్నది తేలాలంటే… ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.