పార్టీ ఏమైపోయినా ఫర్లేదు మనకు పదవులు వస్తే చాలని ఆ మాజీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? గొడవలు పెట్టయినా… గ్రూపులు కట్టయినా సరే… మన పంతం నెగ్గించుకోవాలన్నది వాళ్ల టార్గెట్టా? విషయం తెలిసి నియోజకవర్గాల్లో అవాక్కవుతున్నారా? ఇంతకీ ఎవరా మాజీ శాసనసభ్యులు? ఏ పదవుల కోసం అలాంటి రాజకీయం? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సరికొత్త రాజకీయాన్ని నడిపిస్తున్నారట ఆ రెండు నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు. 2024 ఎన్నికల్లో చివరిదాకా ప్రయత్నించి టికెట్ రాకపోవడంతో భంగపడ్డ ఆ లీడర్స్ వ్యవహారశైలి ఇప్పుడు ఏకంగా టీడీపీ అధిష్టానానికే తలనొప్పిగా మారిందని అంటున్నారు. అందులో ఒకటి సత్యవేడు కాగా… మరొకటి తంబళ్లపల్లి నియోజకవర్గం. ఎన్నికల ముందు నుంచి సీటు కోసం గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న తమ్ముళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదే తీరుతో ఉండటం కేడర్‌ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా మారిందట సత్యవేడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ పరిస్థితి. గత ఎన్నికల్లో వైసిపి నుంచి వచ్చి పసుపు కండువా కప్పుకున్న ఆదిమూలంను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించారు ఇక్కడ. ఒకప్పుడు వేధించి, కేసులు పెట్టించిన వ్యక్తికే పార్టీ సీటు ఇచ్చినా…. అన్ని బాధలన్ని మౌనంగా భరించి అధిష్టానం ఆదేశాలను పాటించామని చెబుతారు సత్యవేడు టీడీపీ కార్యకర్తలు. ఇక మధ్యలో… ఒక మహిళతో ఆదిమూలం అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో బయటికి వచ్చి కలకలం రేపింది. ఒకవైపు గ్రూపులు, మరోవైపు వీడియోలతో ఒకరకంగా సత్యవేడు టీడీపీ కేడర్ పూర్తి గందరగోళంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. సర్లే అని సర్దుకుపోతున్న టైంలో… మళ్ళీ రచ్చ మొదలైందట. గత ఎన్నికల్లో టికెట్టు రాని మాజీ ఎమ్మెల్యే హేమలత తన అనుచరులను తాజాగా అమరావతి పంపారట. ఎమ్మెల్యే ఆదిమూలం తీరుతో పార్టీ నష్టపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. వైసీపీ నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ తమను అణగదొక్కుతున్నారని పార్టీ పెద్దల దగ్గర వాపోయారట ఆ వెళ్లిన వాళ్ళు. ఎమ్మెల్యేని పక్కనబెట్టి… కొత్త ఇన్ఛార్జ్‌ని, అదికూడా….హేమలతను ప్రకటిస్తే…అందరం కలిసి పని చేసుకుంటామని చెప్పివచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎమ్మెల్యే అదిమూలం అనుచరులు, ఇతర పార్టీ సీనియర్స్ కూడా దీనిమీద ఘాటుగా రియాక్ట్ అవుతున్నారట.
గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయకుండా…వైసీపీకి సహకరించిన హేమలత ఇప్పుడు ఇన్చార్జ్ పదవి కోసం తగుదునమ్మా అంటూ…. తన అనుచరులను అమరావతికి పంపి ఇలా డ్రామాలాడిస్తున్నారని రివర్స్ అవుతోందట ఆదిమూలం వర్గం. నియోజవర్గ వ్యవహారాలను పరిశీలిస్తున్న పార్టీ సీనియర్ నేత గంగా ప్రసాద్ సైతం హేమలత వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సత్యవేడులో సహజ వనరులు కూడా ఎక్కువే. ఇక్కడి నుంచే తమిళనాడుకు ఇసుక ,కంకర,మట్టి తరలిస్తుంటారు. శ్రీసిటితో పాటు చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఇలాంటి చోట ఇప్పుడు అధిపత్యం కోసం అందరూ తహతహలాడుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట. వాతావరణం అంతా సెట్ అవుతోందని అనుకుంటున్న టైంలో… మాజీ ఎమ్మెల్యే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సత్యవేడు తరహాలోనే తంబళ్లపల్లి పరిస్థితి ఉందట.. ఇక్కడ గత ఎన్నికల్లో సీటు రాని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఇన్ఛార్జ్ పదవి కోసం చేస్తున్న పనులు కేడర్‌తో పాటు కొందరు నాయకులకు కోపం తెప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న జయచంద్రరెడ్డికి అడ్డు తగలడమే కాకుండా… ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ శంకర్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోందట. ఇప్పటికే నియోజకవర్గంలో టాటా కంపెనీ సహకారంతో భారీ సోలార్ ప్రాజెక్టు రావడంతో పాటు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని, వాటిని ఎలాగైనా ఆపించేందుకు శంకర్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు జయచంద్ర రెడ్డి అనుచరులు. పదవి కోసం శంకర్ యాదవ్ ఇప్పటికే పలుమార్లు అమరావతి ప్రదక్షిణలు చేసినా…. ప్రయోజనం లేకపోవడంతో… తన ప్రాబల్యం కోసం వర్గాలను తయారు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మీద అంగళ్ళులో రాళ్లదాడి జరిగి అధినేత మీదే కేసులు పెట్టిన సమయంలో… ఇన్చార్జిగా ఉన్న శంకర్ ఎక్కడికి పోయాడో చెప్పాలంటున్నారట జయచంద్రరెడ్డి అనుచరులు..అంగళ్ళు గొడవలకు సంబంధించి అందరి మీద కేసులు పెట్టినా… అప్పటి వైసీపీ ప్రభుత్వం శంకర్ మీద మాత్రం కేసు పెట్టలేదని, కుమ్మక్కు రాజకీయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారట మిగతా నాయకులు. ఇలా ఈ రెండు నియోజకవర్గాల సీనియర్ నేతలు పార్టీకి తలనొప్పిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళ ప్రయత్నాలు పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయన్న అసంతృప్తి సైతం వ్యక్తమవుతోందట కేడర్‌లో. గొడవలు పెట్టి అయినాసరే… తమకు ఇన్ఛార్జ్ పదవి సాధించుకోవాలన్న సీనియర్స్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు.