అవును వాళ్ళు కలిసిపోయారు….. మనసులు, చేతులైతే కలిశాయి. ఇక చేతల్లో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఒకప్పుడు ఆ లీడర్ మా జిల్లాలోకి అడుగుపెట్టడానికే వీల్లేదు. మా సంగతి మేం చూసుకోగలం. ఆ దమ్ము మాకుందని బీరాలు పలికిన లీడర్స్ ఇప్పుడు మాత్రం ఆయన్ని రా…. రమ్మని పిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా పిలుపుల పాలిటిక్స్? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,…శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అందుకు ఉదాహరణలు కూడా కోకొల్లలు. అలాగే పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే… అది కామన్. ఒక్క గాంధీ ఫ్యామిలీని తప్ప… పార్టీలో మిగతా ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చు, దాన్ని సమర్ధించుకోనూ వచ్చని కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులే చెప్పుకుంటుంటారు. అందుకు తగ్గట్టే… అంతర్గత ప్రజాస్వామ్యాన్ని విచ్చలవిడిగా వాడేస్తుంటారు కాంగ్రెస్ లీడర్స్. ఆ మాటల యుద్ధంలో మనస్పర్ధలు వస్తుంటాయి. అంతలోనే మాసిపోతుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే…..రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు రేవంత్ రెడ్డి. అప్పట్లో సీనియర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారికి, రేవంత్‌కు పొసిగేది కాదు. ఇంకా నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే… ఉప్పు నిప్పులా ఉండేది వ్యవహారం. అస్సలు రేవంత్‌కి వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉండేవంటే…. రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తే, మా నల్గొండ జిల్లాలో మేమే చేస్తాం, సభలు సమావేశాలకు కూడా పీసీసీతో పని లేదని అన్నారు. అందుకు సంబంధించి గట్టి కామెంట్స్ చేసే వరకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అన్నాక ఇలాంటివన్నీ సహజమేనని అప్పట్లో అనుకున్నారు అంతా. కానీ….రాష్ట్రంలో పార్టీకి పవర్ వచ్చి రేవంత్ సీఎం అయ్యాక నాయకులంతా సెట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అంతా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య సఖ్యత నడుస్తోంది. ఇక ఉత్తమ్….రేవంత్ మధ్య ఆ స్థాయిలో కాకున్నా…. అంశాల వారీగా కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డిని అసలు జిల్లాలోకే అడుగుపెట్టనివ్వని నాయకులు ఇప్పుడు భాయి భాయి అనడం వెనక ఏం జరిగింది? ఏ పాయింట్‌లో సెట్ అయిందని మాట్లాడుకుంటున్నారు పరిశీలకులు. చాలా రోజుల తర్వాత అంతా కలిసి బృందగానం ఆలపిస్తున్నా… ఆందుకు కారణాలు మాత్రం అంతుబట్టడం లేదని కాంగ్రెస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఊరు బ్రాహ్మణవెల్లంలలో రిజర్వాయర్ ప్రారంభానికి సీఎం రేవంత్‌ను స్వయంగా ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నల్గొండసో సీఎం సభ పెట్టించారు. ఇప్పుడిక మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కంప్లీట్‌గా సెట్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఆయన ఏకంగా తన నియోజకవర్గానికి గెస్ట్‌గా ఆహ్వానించారు సీఎంని. మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనంతో పాటు… ఉగాది సందర్భంగా రేషన్ కార్డుల లబ్దిదారులకు సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచే ప్రారంభించబోతున్నారు. తన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఓ కార్యక్రమం ప్రారంభానికి, ఆలయ సందర్శనకు ఉత్తమ్ రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారంటే… ఇక విభేదాలు పూర్తిగా తొలిగిపోయినట్టేనని హ్యాపీ అవుతోందట కాంగ్రెస్ కేడర్.. మొత్తం మీద ముగ్గురి మధ్య అవగాహన రావడం పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే… వీళ్ళని కలిపిందేంటన్న డౌట్ మాత్రం చాలా మందిలో అలాగే ఉందట. సరే… రీజన్ ఏదైతేనేం…. ముందైతే… అల్‌సెట్ కదా… ఇక ఈకలు పీకడం ఎందుకన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదే సమయంలో అదంతా మా పార్టీ స్పెషాలిటీ భయ్…. నిన్న తిట్టుకుంటాం…ఇవాళ కొట్టుకుటాం… రేపు పొద్దున కలిసి నడుస్తాం. మేము మేము ఏమైనా చేసుకుంటాం… కాదనగలిగే దమ్ము ఎవడికైనా ఉందా అంటూ… కాస్త ఎటకారంగా, ఇంకాస్త గడుసుగా మాట్లాడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.