నిర్మల్ రాజకీయాలను భూకబ్జాల బాగోతం హీటెక్కిస్తోంది. భూ ఆక్రమణలు నిరూపిస్తానంటూ మాజీ మంత్రిపై తాజా ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల పర్వం కొత్తకొత్త మలుపులు తిరుగుతోంది. ఇంతకీ భూకబ్జా ఆరోపణల పంతంలో నెగ్గేదెవరు? తగ్గేదెవరు? నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కబ్జాల ముచ్చట కాకరేపుతోంది. ఎక్కడ విన్నా కబ్జాలు..దానిపై లోకల్ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలపై చర్చవినిపిస్తోంది. ఎంపీ ఎన్నికల కంటే ముందు రాజకీయంగా రచ్చకు దారితీస్తుండగా , కబ్జాల కథ తేల్చాలంటూ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారంటా…నిర్మల్ కు వచ్చిన ప్రతిసారి డీమార్ట్ స్థలం ప్రభుత్వం భూమి అంటూ ఆరోపించడమే కాకుండా దేవాదాయశాఖ కు చెందిన 8.32 కుంటల భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్దం అయ్యారంటూ బీజేపీ ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు. ఇదే కాదు డీ వన్ పట్టాల ఇష్యూ తోపాటు నిర్మల్ లో చెరువులు,కుంటలు,విలువైన సర్కార్ భూములను బీఆర్ఎస్ వాళ్లు, ఓ మాజీ మంత్రి ప్రధాన అనుచరులు కాజేశారనేది ఎమ్మెల్యే ప్రతిసారి చేస్తున్న ఆరోపణలే. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మల్ కబ్జాలకు గురైందనేది ఆయన వాదన.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో అప్పుడు మంత్రిగా వున్న ఇంద్రకరణ్ రెడ్డి తాను కబ్జా చేసినట్టు నిరూపించాలనే సవాల్ విసిరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇంద్రకరణ్ ఓటమి పాలుకాగా బీజేపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు…ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కబ్జాల కథ తేల్చుతా…కబ్జాకోరుల ఆటకట్టిస్తా….అక్రమ నిర్మాణాల పై ఉక్కుపాదం మోపడమే కాదు బుల్డోజర్ ప్రయోగిస్తా అంటూ హెచ్చరిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన వాపోతున్నారు. సోఫీనగర్ , గాజులపేట తోపాటు వెంకటాపూర్, అయ్యప్ప టెంపుల్ ప్రాంతాల్లో ప్రభుత్వ, దేవాదాయ భూముల విషయంలోనూ అధికారుల తీరు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా నిర్మల్ పట్టణం శాంతినగర్ లో కబ్జాకు గురైన FSCS రైతు సహకార సంఘం స్థలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఇదొక్కటే తప్ప బీజేఎల్పీ లీడర్ ఇచ్చిన ఫిర్యాదులు, చేస్తున్న ఆరోపణలను యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదనేది బీజేపీ నేతల ఆరోపణ.
అటు మాజీ మంత్రి పార్టీ మార్పు విషయంలో హైదరాబాద్ కే పరిమితం అవుతుండగా…బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయింది..ఇక మాజీ మంత్రి హస్తం పార్టీలో చేరాలని ప్రయత్నాలు ముమ్మరం చేయగా…నిర్మల్ ఎమ్మెల్యే మాత్రం ఈపోరాటం తీవ్రతరం చేయడంపై ప్రెస్ మీట్ లతో శపథం చేస్తున్నారు. మొత్తానికి ఎవరి పంతం నెరవేరుతుందో…ఎవరి భూకబ్జా బాగోతాలు ఎవరు నిరూపిస్తారో కాలమే తేల్చాలని అంటున్నారు లోకల్ జనం.