ఆ జిల్లాలో పాత రాజకీయం కొత్తగా పురుడుపోసుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఆ నాయకురాలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? మాజీ ముఖ్యమంత్రే ఆమె టార్గెట్ అవబోతున్నారా? అందుకే ఏళ్ళుగా జిల్లా రాజకీయాన్ని పట్టించుకోని ఆ మాజీ ఎంపీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? ఎవరా నాయకురాలు? ఏంటా ఇంట్రస్టింగ్ పొలిటికల్ డెవలప్‌మెంట్? ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు విజయశాంతి. ఆమె పేరు ప్రకటించేదాకా ఆ విషయం రాష్ట్ర పార్టీ పెద్దలకు కూడా తెలియకపోవడం షాకింగేనన్న చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. దీంతో ఆమె నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న విషయం మీద దృష్టి పెట్టిన వారికి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయట. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలో రాములమ్మ హాట్ టాపిక్ అయ్యారు. ఈ జిల్లాతోనే ఆమెకు రాజకీయ అనుబంధం ఎక్కువ. తల్లి తెలంగాణ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేశాక 2009లో ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు విజయశాంతి. తర్వాత కేసీఆర్‌తో విభేదించి బయటికి రావడం వేరే స్టోరీ. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి… పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు విజయశాంతి. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్న రాములమ్మ తిరిగి కొన్ని రోజులకే మరోసారి హస్తం గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌కి మద్దతుగా ప్రచారం చేశారామె. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నా…అంత యాక్టివ్‌గా కనిపించలేదు. రాజకీయాలకు దూరమవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ… ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని దక్కించుకున్నారు విజయశాంతి. ఇప్పుడిక ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే…. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలతో పాటు ఆమెతో సత్సంబంధాలు ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదే ఊపులో రాములమ్మకి మంత్రి పదవి వస్తుందని కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఆమె వర్గీయులు. కేబినెట్ బెర్త్ దక్కినా, దక్కకున్నా… ఇక నుంచి మెదక్ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారట మాజీ ఎంపీ. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఎమ్మెల్సీలకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రోటోకాల్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే రాములమ్మ మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ తీసుకొని స్థానిక నేతలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకు బలమైన కారణం ఉందన్న విశ్లేషణలు కూడా పెరుగుతున్నాయి. మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ అవమానించడం వల్లే పార్టీ నుంచి బయటకి వచ్చినట్టు చెప్పుకుంటారు. ఆ కోపంతో… 2014లోనే మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ మీద పైచేయి సాధించాలని అనుకున్నా అది సాధ్యపడకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారట విజయశాంతి. ఇక అప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వైపు పెద్దగా రాలేదు. పార్టీలు మారినా జిల్లాపై పట్టు మాత్రం సాధించలేకపోయింది రాములమ్మ. అప్పటి నుంచి అవకాశం కోసం చూస్తున్నా… 2018, 23 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పడు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాపై పట్టు సాధించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రాములమ్మ ఎమ్మెల్సీగా ఇక్కడ ప్రోటోకాల్ తీసుకుంటే పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ అసమ్మతి నాయకులంతా ఆమెని కలిశారట. దీంతో విజయశాంతి నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో విచిత్రంగా… కాంగ్రెస్ నేతలేగాక… ఇతర పార్టీల్లోని సన్నిహితులు కూడా మెదక్ మీదే దృష్టి పెట్టమని కోరుతున్నారట. ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఆమె వర్గీయులుగా ప్రచారం చేసుకోవడం మొదలైంది. మరి రాములమ్మ తుపాకీ ఎటువైపు ఎక్కుపెడుతుందో… సమీకరణలు ఎలా మారిపోతాయో చూడాలి.