పెద్దలు జానారెడ్డి…. చాలా పెద్ద ప్లాన్‌లోనే ఉన్నారా..? ఆయన లేఖాస్త్రాలు అందులో భాగమేనా? ఏపని చేసినా… శ్రద్ధగా… ఒక మొక్కకు అంటుకట్టినట్టుగా నీట్‌గా చేసుకుపోయే పెద్దాయన ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తున్నారా? ఆయనకు త్వరలోనే అతి ముఖ్యమైన పదవి రాబోతోందన్నది నిజమేనా? అసలిప్పుడు జానా చుట్టూ కొత్త చర్చ ఎందుకు మొదలైంది? కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యవహార శైలిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ముఖ్యుల దగ్గర పలుకుబడి, రాష్ట్ర పార్టీలో పెద్దగా గుర్తింపు ఉన్న జానారెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి యాక్టివ్ అవడం గురించి మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆయన వ్యవహారశైలి ఎందుకో మారిందని అనుకుంటూ… భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం కేబినెట్ విస్తరణ గురించే మాట్లాడుకుంటోంది. అయితే… దానికి సంబంధించి బయట ప్రచారంలో ఉన్న పేర్లు ఒక ఎత్తయితే… జానారెడ్డి సిఫార్సు చేసిన పేర్లు మరో ఎత్తు. విస్తరణలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్టయితే.. సామాజిక న్యాయంపై మరో చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. అందులో భాగంగానే అధిష్టానం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు కనపడుతోంది. కానీ ఇప్పుడున్న ఆశావహుల్లో కూడా ఎక్కువ మంది రెడ్డి సామాజికవర్గం నుంచే ఉన్నారు. ఈ క్రమంలో…. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నేతల్ని మంత్రివర్గ విస్తరణలో పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆయన ఇటీవల ఏఐసీసీకి లెటర్ రాశారు. సొంత జిల్లా నల్గొండ నుంచి ఆశావహులు ఉన్నా… వదిలేసి ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాల గురించే జానారెడ్డి ఎందుకు లెటర్ రాశారన్న డౌట్స్ వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు మెల్లిగా ఆ చిక్కుముడి వీడిపోతోందని అంటున్నారు పరిశీలకులు. ఆయన వ్యూహాత్మకంగానే లేఖ రాశారన్న అంశం చర్చలోకి వచ్చింది.
జానారెడ్డికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే… సామాజిక సమతౌల్యం దెబ్బతినకుండా… కులం పేరుతో తన అవకాశానికి గండి పడకుండా పెద్దాయన ముందే జాగ్రత్త పడ్డారా అన్న డౌట్స్ వస్తున్నాయట. ప్రభుత్వంలో ఇప్పటికే రెడ్ల డామినేషన్ పెరిగిపోయిందన్న టాక్ ఉంది. దానికి తోడు విస్తరణలో కూడా రెడ్లకే ఛాన్స్ దక్కితే…. ఇక ఆ తర్వాత జరిగే నియామకాల్లో ఆ కులానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చన్న ప్రచారం ఉంది. ఎంతైనా…. ఎక్స్‌పీరియెన్స్ కదా… అందుకే పెద్దలు ముందే జాగ్రత్తపడి ఉంటారన్నది కొందరి అభిప్రాయం. ఇప్పటికే నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రెడ్డి నేతలు క్యాబినెట్‌లో చోటు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రంగారెడ్డి జిల్లా రెడ్ల ఒత్తిడి కూడా ఉంది. ఈ క్రమంలోనే జానారెడ్డి రంగారెడ్డి జిల్లా నేతలకు అనుకూలంగా లేఖ రాశారట. మరి అక్కడ కూడా రెడ్డి నాయకులే రేస్‌లో ఉన్నారు కదా అంటే….దాని వెనక కూడా ఓ వ్యూహం ఉండి ఉంటుందని అంటున్నారు. సందర్భం ఏదైనా కావచ్చు జానారెడ్డి లోతైన మనిషి అన్న పేరుంది. తన ఆలోచనల్ని ఆయన ఎక్కడా బయటపెట్టరు. కానీ ఇటీవల రాసిన లేఖతో కాస్త డిఫరెంట్ చర్చ జరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన అవకాశాలు దెబ్బతినకుండా… ఎత్తుగడలు అవలంభిస్తున్నారన్న విశ్లేషణలున్నాయి. కానీ ఆయన మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా ఓపెన్ కాలేదు.