అక్కడ కూటమిలోని బాబాయ్, అబ్బాయ్ ఓ అండర్‌స్టాండింగ్‌తో పంచేసుకుంటున్నారా? నీకది, నాకిది అంటూ… వాటాలేసుకునమి మరీ ఎవరికి వాళ్ళు వసూళ్ళ పర్వంలో మునిగి తేలుతున్నారా? కాకుంటే… వాటికి కాంట్రాక్ట్‌లు అంటూ ముద్దు పేరు పెట్టుకుని మరీ లాగించేస్తున్నారా? ఎంత కొమ్ములు తిరిగిన కంపెనీ అయినాసరే…. వాళ్ళని కాదని అడుగు ముందుకేసే పరిస్థితి లేదా? ఎవరా బాబాయ్, అబ్బాయ్? ఏంటా బెదిరింపుల పర్వం? జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ. ఇప్పుడు భారీ పరిశ్రమలకు అడ్డా. సాధారణంగా హెవీ ఇండస్ట్రీస్, అదీ జాతీయ స్థాయి ఉన్న ఫ్యాక్టరీలు పెడితే… అక్కడ లోకల్ ప్రమేయం తక్కువగా ఉంటుంది. లోపల ఏం చేయాలన్నా కంపెనీ యాజమాన్యం ఇష్టం. స్థానిక రాజకీయ నేతలు కూడా అడపా దడపా సందర్భాన్ని బట్టి అటువైపు చూస్తుంటారు. మేనేజ్‌మెంట్స్ కూడా కొన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేస్తుంటాయి. కానీ… జమ్మలమడుగులో మాత్రం సీన్ వేరేగా ఉంటోందట. ఎంతైనా ఫ్యాక్షన్ గడ్డ, అందునా అదే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే. అందుకే ఇండస్ట్రీని రఫ్పాడించేస్తున్నారట. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన అన్న కొడుకు, టీడీపీ లీడర్ భూపేష్‌రెడ్డి కలిసి పంచేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు లోకల్‌గా. బాబాయ్ సిమెంట్ ఫ్యాక్టరీల మీద పడితే… అబ్బాయ్ సోలార్ కంపెనీల్ని టార్గెట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక ప్రాంతాల్లో వీళ్ళిద్దరి ఆగడాలకు అంతేలేకుండా పోతోందన్న టాక్ నడుస్తోంది జమ్మలమడుగులో. వీళ్ళు చెప్పిన వాళ్ళకే కంపెనీల్లో కాంట్రాక్ట్‌లు ఇవ్వాలి, కాంట్రాక్ట్ లేబర్‌గా సైతం వాళ్ళ వారినే తీసుకోవాలి. లేదంటే ఏదో ఒక రచ్చ పెట్టి… మొత్తానికి ప్రొడక్షనే ఆగిపోయేలా చేస్తున్నారంటూ లబోదిబోమంటున్నారట ప్లాంట్ ఆఫీసర్స్. తాము చెప్పినట్టు వినకుంటే… కార్లు అడ్డంపెట్టి మరీ బెదిరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ రకంగా కంపెనీల యాజమాన్యాలను బెదిరించి మరీ దారికి తెచ్చుకుంటున్నారని, వీళ్ళ దెబ్బకు నేషనల్ కంపెనీలు సైతం జీ హుజూర్ అనాల్సి వస్తోందని అంటున్నారు. సిమెంట్ కంపెనీల్లో కాంట్రాక్ట్‌లను వంద శాతం తన మనుషులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. లేదంటే… అల్ట్రాటెక్ లాంటి బడా కంనీల పనుల్ని సైతం అడ్డుకోవడానికి ఎమ్మెల్యే మనుషులు వెనుకాడటం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోకి ఏ కంపెనీ వచ్చినా సరే… ఎమ్మెల్యే మనుషులు ఎంటరైపోతున్నారని, వాళ్ళకు కప్పం కట్టకుండా అడుగు ముందుకు వేసే పరిస్థితిలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జమ్మలమడుగులో. కొండాపురం మండలంలో ఓ సోలార్ పవర్ కంపెనీకి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ కాంట్రాక్ట్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి రెండు వర్గాలు తుపాకులు ఎక్కుపెట్టుకునేదాకా వెళ్ళిందట. ఇక అదానీ సంస్థ నిర్మిస్తున్న వెయ్యి మెగావాట్స్ పవర్ ప్లాంట్ సబ్ కాంట్రాక్ట్ పనుల కోసం నానా బీభత్సం చేశారు ఎమ్మెల్యే అనుచరులు.
అప్పటికే ఆ వర్క్ దక్కించుకున్న రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టే టైంలో ఆఫీస్ మీద దాడిచేసి వార్నింగ్స్ ఇవ్వడంతో… మేటర్ పైదాకా వెళ్ళింది. అటు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్‌తోపాటు లేబర్ కాంట్రాక్ట్ పనుల్ని తమకే ఇవ్వాలంటూ ఏకంగా మైనింగ్ జోన్‌లోకి వెళ్ళి సున్నపురాయి లారీలకు కార్లు అడ్డుపెట్టి మరీ ఫ్యాక్షన్ తరహాలో బెదిరించారట ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు. బాబాయ్ సంగతి అలా ఉంటే…ఇటు అబ్బాయ్, జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జి దేవగుడి భూపేష్ రెడ్డి ఇంకో ఆకు ఎక్కువే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. కడప-నంద్యాల జిల్లాల సరిహద్దులో కొత్తగా నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టుల జంగిల్ క్లియరెన్స్ పనుల పట్టుబట్టారట భూపేష్. పెద్దముడియం మండలం పాపయ్య పల్లె దగ్గర 1500 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 1000 ఎకరాల్ని రైతుల నుంచి సమీకరించింది ప్రైవేట్ కంపెనీ. మరో 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలంటూ నెడ్‌క్యాప్‌కు దరఖాస్తు చేసుకుంది.అయితే… ఆ 500 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో తన వర్గానికే ఇవ్వాలని కంపెనీ మేనేజ్‌మెంట్ మెడ మీద కత్తి పెట్టినంత పని చేశారట భూపేష్‌రెడ్డి. అదే సమయంలో ఈ వ్యవహారం తెలిసి వైసీపీ నాయకులు సైతం మా సంగతేంటి అంటూ సీన్‌లోకి వచ్చారట. దీంతో ఇక చేసేది లేక సదరు సోలార్ కంపెనీ…70 శాతం పనుల్ని టీడీపీకి, 30 శాతం వైసీపీకి అప్పగించి దండం పెట్టేసినట్టు తెలిసింది. ఇలా… ఓవరాల్‌గా ఓవైపు బాబాయ్, మరోవైపు అబ్బాయ్ కలిసి నియోజకవర్గంలో నానా యాగీ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ళ దెబ్బకు పరిశ్రమ యాజమాన్యాలే బెదిరిపోతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఓవైపు రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టమని ఆహ్వానిస్తూ… వాటి కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే… మరోవైపు నియోజకవర్గాల్లో ఇలాంటి బెదిరింపుల పర్వం నడుస్తోందని, ఇలాగైతే ఇన్వెస్టర్స్ ఎలా వస్తారన్నది కామన్ క్వశ్చన్.