ఆ ఉమ్మడి జిల్లాలో కారు పార్టీకి నాయకత్వం కరవైందా? నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు ఉన్నా లేనట్టుగా, పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? స్వయంగా కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చినా… లైట్ తీస్కో బాసూ… అన్నట్టుగా ఉన్నారా? ఇప్పుడు అడుగు ముందుకేస్తే జేబులు గుల్ల తప్ప ప్రయోజనం లేదనుకుంటున్నారా? లేక పొలిటికల్ ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారా? ఏదా ఉమ్మడి జిల్లా? అక్కడ బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యేల తీరు పై.. గులాబీ క్యాడర్ గుస్సాగా ఉందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యమా రంజుగా ఎంజాయ్ చేసేసి…తీరా ఇప్పుడు కష్ట కాలంలో ఉంటే.. ముఖం చాటేస్తారా అంటూ మండిపడుతున్నట్టు తెలిసింది. స్వయంగా.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చినా… ఏమాత్రం పట్టింపులేనట్టు నియోజకవర్గాలకు ముఖం చాటేయడం ఏంటంటూ…రుసరుస లాడుతున్నారట. అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ మహిళా శాసనసభ్యులను ఉద్దేశించి సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కానీ… నిజామాబాద్ జిల్లాలో సగానికి పైగా సెగ్మెంట్స్‌లో అసలా నిరసన ప్రదర్శనల ఊసే లేదట. బాల్కొండ, కామారెడ్డిలో సీఎం దిష్టిబొమ్మల్ని తగలబెడితే…. బాన్సువాడ, ఆర్మూర్‌లో మమ అనిపించేశారట. ఇక నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ బీఆర్‌ఎస్ నాయకులైతే… కేటీఆర్ ఆదేశాలను చాలా లైట్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు కార్యక్రమం ఉందన్న సంగతిని కూడా కేడర్‌కు చెప్పలేదని, దిశా నిర్దేశం లేకపోవడంతో ఎవరికి వాళ్ళు కామ్‌గా ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ దాదాపుగా ఖాళీ అయిందంటున్నారు. త్వరలో మేయర్ సైతం పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే బిగాల కూడా వలసలను అడ్డుకోలేకపోతున్నారట. ఆయన సైతం అడపాదడపా నియోజకవర్గానికి వచ్చిపోతున్నారు తప్ప సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని కేడర్ చిటపటలాడుతోంది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక నియోజకవర్గానికి పెద్దగా రావడం లేదట. ఇక కేడర్ సైతం హస్తం గూటికి క్యూ కడుతున్నారన్న ప్రచారం ఉంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారట. అసలీ ఏడు నెలల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదట ఆయన. బోథన్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి షకీల్‌ను తప్పించాలన్న డిమాండ్ కేడర్‌లో పెరిగిపోతున్నట్టు తెలిసింది. ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షునిగా ఉన్నా… ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆర్మూర్ లోనూ ద్వితీయ శ్రేణి నేతలు హస్తం గూటికే క్యూ కడుతున్నారట. ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇలా… వీళ్ళంతా క్యాడర్‌కు అందుబాటులో ఉండకుండా.. నియోజకవర్గానికి ముఖం చాటేయడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అనే టాక్ నడుస్తోంది ఉమ్మడి జిల్లాలో. పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న కొందరు.. టచ్ మి నాట్ అన్నట్లు ఉంటున్నారా? లేక ఇప్పుడు గ్రౌండ్‌లోకి దిగితే… ఎక్కడ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందోనని లైట్ తీసుకుంటున్నారా..? అన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. దీంతో మాజీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు రాబోతున్నందున.. పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయాల్సిన లీడర్లు పట్టించుకోకపోవడం ఏంటంటూ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడసలు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు ఇన్ఛార్జ్‌లు ఉన్నట్టా? లేనట్టా? అన్న డౌట్స్ సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో తాజా మాజీలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారోనన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో.