కామారెడ్డి గులాబీ తోటలో కుంపట్లు అంటుకున్నాయా? ఆ మాజీ ఎమ్మెల్యే ఇగో డీప్‌గా హర్ట్ అయిందా? నాకు ముందు చెప్పకుండా…. నా సెగ్మెంట్‌లో మీటింగ్ పెడతారా? ఆ పని చేసింది పార్టీ పెద్ద అయితే ఏంటీ? మరొకరైతే ఏంటి? డోంట్ కేర్ అన్నారా? తన అనుచరుల్ని సైతం వెళ్ళకుండా అడ్డుకున్న ఆ బీఆర్‌ఎస్ నాయకుడు ఎవరు? ఏంటా ఇగో యవ్వారం? కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ వ్యవహార శైలిపై..పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోందట. బీసీ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు…. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగా… ఇటీవల కామారెడ్డి కేంద్రంగా.. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కవిత. ఈ సమావేశానికి బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ , పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ కు ఆహ్వానం పంపారట. కానీ సదరు నేతలు ఇద్దరూ డుమ్మా కొట్టారు. అంతేకాదు…. తమ వర్గీయులను సైతం వెళ్లకుండా కట్టడి చేశారట ఆ ఇద్దరు. స్వయంగా కవిత ఏర్పాటు చేసిన మీటింగ్‌కు వీళ్ళిద్దరూ వెళ్ళకపోవడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసిందట. మీటింగ్‌కంటే ఎక్కువగా ఈ ఇద్దరు నేతల డుమ్మా కొట్టడం గురించే మాట్లాడుకుంటున్నారట. అయితే దీని వెనక చాలా కారణాలున్నాయని అంటున్నారు. గంప గోవర్ధన్‌కు బీఆర్‌ఎస్‌లో సీనియర్ బీసీ నేతగా గుర్తింపు ఉంది. ఐతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీ పై అసంతృప్తితో రగిలిపోతున్నారట ఆయన. పార్టీ అధినేత కోసం తన సీటు త్యాగం చేసినప్పటికీ.. ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని నొచ్చుకున్నారట గంప.
పుండు పై కారం చల్లినట్లు తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం తేదీ ప్రకటించడం, ఆయన్ను కాదని మాజీ టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రానంద్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో.. సదరు మాజీ ఎమ్మెల్యే ఈగో హర్ట్ అయినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశానికి రాకుండా..చివరికి తన వర్గీయులు కూడా వెళ్లకుండా కట్డడి చేశారనే టాక్ నడుస్తోంది జిల్లాలో. కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన సమావేశానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీసీ నేత జాజుల సురేందర్ హాజరయ్యారు. ఆయన సైతం ఇష్టంగా కాకుండా కష్టంగానే సమావేశానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జీలను కాదని, కామారెడ్డిలో మహిళా నేతకు, ఎల్లారెడ్డి కి చెందిన మాజీ గ్రంథాలయ సంస్ధ చైర్మన్ సంపత్ గౌడ్ కు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల లోలోపల రగిలిపోతున్నారట సదరు మాజీలు.అయితే… అందర్నీ కలుపుకుని పోవాలన్న పట్టుదలతో ఉన్న కవిత… గంపకు సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పార్టీలో చిచ్చురేపేదాకావెళ్ళినా…. కవిత జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే ఈగోను గో అనేలా చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు ఆయన పూర్తిగా కన్విన్స్ అయ్యారా లేదా అన్నది తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.