అమ్మోరి సాక్షిగా…. ఆ ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? ఓ నామినేటెడ్ పోస్ట్ విషయమై పంతాలకు పోతున్నారా? ఇచ్చిన జీవోనే నిలిపివేయించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరి మధ్య మరో మంత్రి నలిగిపోతున్నారన్నది నిజమేనా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎవరా ముగ్గురు మంత్రులు? భద్రాద్రి జిల్లా పాల్వంచ పెద్దమ్మ టెంపుల్ ఛైర్మన్ నియామకం పొలిటికల్ రంగు పులుముకుంది. అదీకూడా అలాఇలా కాదు. ఆ పోస్ట్‌ని తమ అనుచరులకు ఇప్పించేందుకు అగ్రనాయకులే పావులు కదుపుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముందు చైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్ పేరుతో మార్చి ఆరున ఉత్తర్వులు జారీ అయ్యాయి. కమిటీని కూడా వేశారు. అయితే… గతంలో బీఆర్‌ఎస్‌తో అంటకాగిన రాజశేఖర్‌కు ఇప్పుడు దేవస్థానం ఛైర్మన్ పదవి ఇవ్వడం ఏంటన్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయట. అయితే దీని వెనక చాలా తతంగం జరిగిందని అంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కీలకంగా పని చేస్తున్న పోట్ల నాగేశ్వరరావు జమ్ముల రాజశేఖర్‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గరికి తీసుకు వెళ్ళారట. ఆయనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం డిసిసి అధ్యక్షుడు పొదెం వీరయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అ తర్వాత జిల్లా ఇన్ చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఓకే చేసేశారట.వారి ఓకే లెటర్స్‌తో జమ్ముల రాజశేఖర్ ఛైర్మన్‌గా పాలకవర్గం నియామకానికి లైన్ క్లియర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో… పాలకమండలి ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట జమ్ముల రాజశేఖర్. ఆ దశలోనే కథ కీలక మలుపు తిరిగిందని అంటున్నారు. తనకు తెలియకుండా దేవస్థానం చైర్మన్ పదవిని ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తారంటూ మంత్రి కొండా సురేఖతో అన్నారట మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నా ప్రమేయం లేకుండా ఏర్పాటు చేసిన పాలక వర్గం బాధ్యతలు తీసుకోకుండా ఆపాల్సిందేనని పొంగులేటి పట్టు పడడంతో … తప్పనిసరి పరిస్థితిలో మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో పాలక వర్గాన్ని అబయెన్స్‌లో పెట్టినట్టు తెలిసింది. అక్కడితో ఆగకుండా తనకు కావాల్సి వారితో మరో పాలక వర్గాన్ని తయారు చేశారట పొంగులేటి.
దాన్ని ఒకే చేయాలంటూ దేవదాయశాఖ మంత్రి పై వత్తిడి తీసుకుని వస్తున్నట్టు సమాచారం. దీంతో వ్యవహారం చివరికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి వర్గాల మధ్య చిచ్చుగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి జిల్లాలో 6ఎ పరిధిలోకి వచ్చే ఆలయాలు నాలుగే ఉన్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం గణేష్ టెంపుల్, జమలాపురం దేవస్థానంతో పాటు పెద్దమ్మ తల్లి టెంపుల్ మాత్రమే ఆ నాలుగు. భద్రాచలంతో పోటీ పడే ఆదాయ వనరులు ఉన్న దేవస్థానం పెద్దమ్మ టెంపుల్ కావడంతో ఈ ఛైర్మన్‌గిరీ కోసం పోటీ గట్టిగానే ఉందట. అందుకే ఎవరికి వారు పావులు కదుపుతున్నట్టు సమాచారం. మరో నాయకుడు బాలినేని నాగేశ్వరరావు ఛైర్మన్‌గా పొంగులేటి లేఖ ఇచ్చారట. ఆయనకు సపోర్ట్‌గా ఎంపీ రఘురామి రెడ్డి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివ రావు కూడా లెటర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… రెండు వర్గాల నుంచి లేఖలు అందుకున్న ఇద్దరు నాయకులు జమ్ముల రాజశేఖర్, బాలినేని నాగేశ్వరరావు బంధువులు, ఒకే ఊరికి చెందినవారు. ఈ రకంగా చూస్తే ఇప్పుడీ ఆలయ ఛైర్మన్ పదవి ఇటు బంధువుల మధ్య, అటు ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చుపెట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయవర్గాల్లో. ఇప్పటికే ఈ టెంపుల్ చైర్మన్ నియామకానికి సంబంధించి జీవో ఇచ్చినందు వల్ల నెల రోజుల్లోపు అది అమల్లోకి రావాల్సి ఉంటుంది. అలా జరక్కుండా వెనక్కిపోతే భట్టి విక్రమార్కకు, అమలై తాను చెప్పిన వారికి పదవి దక్కకుంటే పొంగులేటికి రాజకీయ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మరోవైపు తనపేరుతో వచ్చిన జీవోని తీసుకుని డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని దగ్గరికి వెళ్ళారట జమ్ముల రాజశేఖర్. ఆ ఛానల్‌లో గట్టిగా ప్రయత్నిస్తుండటంతో… రెండు వర్గాల మధ్య ఇరుక్కుపోయానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫీలవుతున్నట్టు సమాచారం. ఇద్దరు మంత్రుల్లో ఎవ్వరికీ సర్ది చెప్పలేక సతమతం అవుతున్నట్టు తెలిసింది. మరి నెల రోజుల్లో జీవో అమలవుతుందా? లేక పొంగులేటి ఇచ్చిన లేఖే ఒకే అవుతుందా.. అసలు ఇద్దరికీ కాకుండా ఈ దేవస్థానం చైర్మన్ పోస్టుని అబయెన్స్‌లోనే ఉంచుతారా అన్నది చూడాలి.