ఆ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నట్టు? తనకు బీ ఫామ్ ఇచ్చి గెలిచిన పార్టీలోనా? లేక తాను కండువా కప్పుకున్న అధికార పార్టీలోనా? ఆరు నెలల నుంచి కామ్‌గా ఉండి ఇప్పుడే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? నా మీద బురద చల్లుతున్నారన్న ఫిర్యాదు వెనక మతలబేంటి? ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏంటా కథ? ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన్ని గులాబీ ఎమ్మెల్యేగా చూడాల్నా? లేక కాంగ్రెస్ కౌంట్‌లో వేయాల్నా? ప్రస్తుతం గద్వాలలో చాలా మందికి ఇదే డౌట్ వస్తోందట. అదేంటీ… ఆరు నెలల క్రితం ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. పార్టీ కండువా కప్పుకున్నారని అంటే…. ఏమో… అదంతా తెలీదు. ఇప్పుడాయన చర్యల్ని చూస్తుంటే మాత్రం మాకేదో డౌట్ కొడుతోందని అంటున్నారట నియోజకవర్గ ప్రజలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీదే గెలిచారు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. కానీ… రాష్ట్రంలో అధికారం మారడం, వివిధ సమీకరణలతో ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారాయన. కానీ… తాజాగా నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ… స్వయంగా ఆయనే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పార్టీ మారినట్టు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో రాశారాయన. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. నేను బీఆర్‌ఎస్ నుంచి గెలిచాను, ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను. కొందరు కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్‌కు సంబంధించిన వాళ్ళు ఫ్లెక్సీల్లో నా ఫోటోలు వేస్తున్నారు, నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ కృష్ణమోహన్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో ఇటు జిల్లా కాంగ్రెస్ నాయకులు సైతం షాకయ్యారట.
ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తగా ఇలా ఫిర్యాదు చేయడం ఏంటి? ఆయనపై తప్పుడు ప్రచారం ఏంటి? వైషమ్యాలను రెచ్చగొట్టడం ఏంటంటూ చర్చ జరుగుతోంది. అయితే… మంత్రి జూపల్లి కృష్ణారావు సపోర్ట్‌తో ఆరు నెలల క్రితం కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాక పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే వర్గం కాగా… మరోటి అప్పటికే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిఉన్న మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యది. ఈ వర్గపోరే… ఇప్పుడు కృష్ణమోహన్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌కు కారణమా అన్న డౌట్స్ ఓవైపు ఉండగా… మరోవైపు అంతకు మించిన టెక్నికల్ డౌట్స్ కూడా వస్తున్నాయట కొందరికి. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కోర్ట్‌లో ఉంది. దీనిపై ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, అనర్హత వేటు ఖాయమని ప్రచారం చేస్తోంది బీఆర్‌ఎస్. సరిగ్గా ఈ పాయిట్‌ని బేస్ చేసుకునే కృష్ణమోహన్‌రెడ్డి పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా? రేపు కోర్ట్‌లో అనర్హత పిటిషన్ విచారణకు వస్తే… సాంకేతికంగా తనకు ఇబ్బంది కలగకుండా ముందే జాగ్రత్త పడ్డారా అన్నది కొందరి అనుమానం అట. ఇక ఇదే సమయంలో కృష్ణ మోహన్ రెడ్డి ఫిర్యాదు కాపీతో పాటు FIR కాపీని కూడా వైరల్ చేస్తోంది సరిత వర్గం. అసలైన కాంగ్రెస్ నేతలం మేమే…ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరాక తూచ్… నేను బీఆర్ ఎస్ లోనే ఉన్నానని నాలుక మడతేశారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది సరిత వర్గం. మొత్తం మీద గద్వాల ఎమ్మెల్యే ఎపిసోడ్ పై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో… దీనిపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.