వరుస కుంభకోణాలు.. ఆ జిల్లా నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా?. మదనపల్లి ఫైల్స్, టీడీఆర్ బాండ్స్, నకిలీ ఎపిక్ కార్డ్స్, ఆడుదాం ఆంధ్రా.. ఇలా ఏ స్కాం చూసినా ఆ జిల్లా నేతలే నిండా మునిగిపోయారా?. ఎప్పుడు ఎవరి మీద కేసు నమోదవుతుందో? ఎవర్ని విచారణకు పిలుస్తారోనన్న టెన్షన్ వైసీపీ నేతలు వెంటాడుతోందా?. మొన్నటి వరకు ధీమా ఉన్న నేతలు సైతం.. ఇప్పుడు లోలోపల భయంతో వణికిపోతున్నారా?.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు గత ప్రభుత్వం హయాంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభుత్వం మారిపోవడంతో..ఇప్పుడా పార్టీ సీనియర్ నేతలకు కేసుల టెన్షన్ పట్టుకుందట. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా…సీఐడీ కేసుల గురించే చర్చ జరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వైసీపీ కేడర్ తలలు పట్టుకుంటోందట. ప్రస్తుతం జిల్లాలో ఏ ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కలిసినా…సిఐడి ఎలా ముందుకు వెళుతుంది ? ఆ కేసులు నాయకుల మెడకు చట్టుకుంటుందా ? అనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసులో…తమ తప్పేమీ లేదని ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ సవాల్ విసిరారు పెద్దిరెడ్డి. సీనియర్ అసిస్టెంట్ కస్టడీలో ఉండగానే…పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని అరెస్టుతో షాక్ తగిలిందట. పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారాం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఆయనపై సీఐడీ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడంతో పెద్దిరెడ్డికి టెన్షన్ పట్టుకుందట.
మదనపల్లి పరిసర ప్రాంతల్లో గద్దల్లా భూములు కాజేసిన వారంతా…భయంతో వణికిపోతున్నారట. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీపై మంగళంపేట అటవీ భూములతో పాటు తిరుపతి బుగ్గమఠం భూముల ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఈ భూములపై సర్వే కూడా పూర్తయింది. అటు నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో బయటపడిందట. దీనికి తోడు తుడా నిధులను సొంతానికి వాడారన్న దానిపై విజిలెన్స్ విచారణ సాగుతోంది. దీంతో ఈ రెండు కేసుల్లో చెవిరెడ్డికి చిక్కులు తప్పవని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ కేసులో ఐఎఎస్ గిరీషాతో పాటు మరో అధికారి సస్పెండ్ అయ్యాడు.
మరోవైపు ఆడుదాం ఆంధ్రా కేసు…మాజీ మంత్రి రోజాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం, టూరిజం శాఖలో దందాలు, ఏపిఐఐసి భూముల కొనుగొలు వ్యవహారంపై సీఐడీ విచారణ చేస్తోంది. శాప్ ప్రధాన కార్యాలయంలో సీఐడీ కీలక వివరాలు సేకరించిందట. ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం…వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఇక తిరుపతిలో టీడీఆర్ బాండ్స్‌పై విజిలెన్స్ విచారణ జరుగుతూనే ఉంది. టీడీఆర్ బాండ్లతో తిరుపతి నగర పాలక సంస్థ వంద కోట్లకుపైగా నష్టపోయిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ మార్పులో భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసుల్లో స్పీడు పెరిగితే మరింత మంది నిందితులుగా మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
Als Read: Mohammed Shami: మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు!
జిల్లాలోని పెద్దిరెడ్డి ఫ్యామిలీ మదనపల్లి ఫైల్స్, అటవీ భూములు, బుగ్గమఠం భూముల అక్రమణ కేసుల్లో ఇరుక్కుపోయింది. చెవిరెడ్డిని నకిలీ ఓటర్లు జాబితా, తుడా నిధుల దుర్వినియోగం కేసులు, భూమన కుటుంబంపై నకిలీ ఎపిక్ కార్డులు, టిడిఅర్ బాండ్స్ కుంభకోణం కేసులు, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలున్నాయి. మాజీ మంత్రులు రోజాపై ఆడుదాం ఆంధ్రాతో పాటు…టూరిజం శాఖలో అక్రమాల కేసులు వెంటాడుతున్నాయి. ఇలా జిల్లాకు చెందిన ప్రముఖులంతా సిఐడి టార్గెట్‌లో ఉన్నారట. దీంతో ఎప్పుడూ ఏం జరుగుతుందోననే ఆందోళన సదరు నేతలకు ఉందట. ఇప్పటి దాకా కేసులు పెట్టిన సీఐడీ…మరో అడుగు ముందుకు వేస్తే వాట్ నెక్స్ట్ అన్నది అంతుపట్టక తలలు పట్టుకుంటున్నారట జిల్లా నేతలు.