Off The Record: బెజవాడ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం ఎంట్రీ ఇవ్వబోతోందన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా కుమార్తె ఆశ రాజకీయాల్లోకి రాబోతున్నారన్నదే ఆ చర్చకు ప్రధాన కారణమట. ఇప్పటికే రంగా కుమారుడు రాధా రాజకీయాల్లో ఉన్నారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రాధ ఆ తర్వాత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టిడిపికి స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే పరిమితమయ్యారు. రంగా వారసుడిగా రాధా రాజకీయాల్లో ఉన్నా… ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలే రాజకీయంగా ఆయనకి ఎక్కువ అపజయాలు మిగిల్చాయన్నది లోకల్ టాక్. రాజకీయంగా రాధా అపజయాలతో రంగా అభిమానులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతారు. వంగవీటి రంగాకి కాపు సామాజిక వర్గం నుంచి బలమైన అభిమాన గణం ఉంది. కోస్తా ఆంధ్రాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగా అభిమానులు ఉన్నారు. ఆయన మరణం తర్వాత భార్య రత్నకుమారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కుమారుడు వంగవీటి రాధా విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా కూడా అపజయాలు పలకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రంగా కుమార్తె ఆశను వారసురాలిగా తీసుకురావడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు రాధా . అయితే….వచ్చే ఎన్నికల్లో ఆశాకు టికెట్ ఇచ్చి విజయవాడ సిటీ నుంచి పోటీ చేయించాలని వైసీపీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆశా కొన్నాళ్లు విదేశాల్లో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఆరేళ్ల నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. రంగా జయంతి కార్యక్రమాల్లో తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారామె. అయితే ఇప్పటిదాకా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సోదరుడు రాధాతో కూడా ఆశాకు సత్సంబంధాలున్నాయన్నది కుటుంబ సన్నిహితులు చెప్పే మాట. కానీ… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాత్రం వంగవీటి కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇదంతా ఒక వర్గం కావాలని సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం తప్ప వేరే ఏం కాదని కొట్టిపారేస్తున్నారట రాధా సన్నిహితులు. ఆశా పేరును రాజకీయాల్లోకి తీసుకు రావడం ద్వారా గందర గోళం సృష్టించటం తప్ప వేరే ఆలోచన లేదని అంటున్నారట. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దానిపై రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, ఇలాంటి ప్రచారాలను లైట్ తీసుకోవాలని అంటున్నారట.