Off The Record: శిరోముండనం కేసులో శిక్ష పడిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. 28 ఏళ్ల నాటి కేసులో సరిగ్గా ఎన్నికలకు ముందే తీర్పు రావడం ఇబ్బందికరమేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఆ కేసులో శిక్ష పడటం, వెంటనే బెయిల్ రావడంతో… పోటీ చేయడానికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు న్యాయ నిపుణులు. అయితే అసలు డౌట్స్ అన్నీ.. ప్రజా కోర్ట్‌లో తీర్పు ఎలా ఉంటుందన్నదే. ఈనెల 25తో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది. ఆ లోపే శిక్షపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్ళాలనుకుంటున్నారట త్రిమూర్తులు. 1955 ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ చట్టం ప్రకారం అంటరానితనం, కుల వివక్ష కేసుల్లో 6 నెలలకు పైబడి శిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఇందులో ఎక్కడా… ఎస్సీ ఎస్టీ కేసులకు ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టంగా లేదు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఎన్నికల సంఘానికి లేదు. ఇక పూర్తిగా కోర్ట్‌లో తేలవాల్సిన మేటర్ కావడంతో తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికిప్పుడు అడ్డంకులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు న్యాయ నిపుణులు.
మరోవైపు ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. తోట త్రిమూర్తులును వైసీపీ నుంచి, ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. దళిత సామాజిక వర్గాలతో కలిసి దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారట తెలుగుదేశం నాయకులు. ఒకవేళ ఎన్నికల్లో పోటీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయం మీద కూడా తోట దృష్టి పెడుతున్నట్టు తెలిసింది. మండపేటలో ఎవరు పోటీ చేసినా వైసీపీ గెలుపు ఖాయమంటూ ఇప్పటికే ఇన్‌డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారాయన. ఒకవేళ తేడా పడితే తనకు బదులుగా…. కొడుకు పృథ్వీరాజ్‌ను బరిలో దింపే ఆలోచన ఉన్నట్టు తెలిసింది. ముందు జాగ్రత్తగా పృధ్వీరాజ్‌తో డమ్మీ నామినేషన్ వేయించే ప్లాన్ ఉందట. శిరోముండనం కేసు తర్వాత కూడా తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరపున గెలిచి 2019లో అదే పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారాయన. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. అంతకు ముందు 2009లో ప్రజారాజ్యం తరపున కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనంతో త్రిమూర్తులు కూడా హస్తం నేతగా మారిపోయారు.
ఇలా… తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు దళిత యువకులకు శిరోముండనం చేసిన త్రిమూర్తులు ఆ తర్వాత అన్ని పార్టీలను టచ్ చేశారు. ఆ ఘటన రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగింది. కానీ… ఇప్పుడాయన మండపేట నుంచి పోటీలో ఉన్నారు. అలాగే శిరోముండనం బాధితుల్లో కొందరు ప్రస్తుతం త్రిమూర్తులు వెంట ఉన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే.. కోర్ట్ తీర్పు ప్రభావం జనం మీద పెద్దగా ఉండకపోవచ్చన్నది వైసీపీ లెక్కగా చెప్పుకుంటున్నారు. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో నాడు ఈ ఘటన జరిగింది. 28 ఏళ్ళక్రితం ఐదుగురు దళితులను హింసించి అందులో ఇద్దరికి శిరోముండనం చేసిన కేసు అది. అందులో త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వచ్చింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన ఈ కేసుకు సంబంధించి మూడు నెలలు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో వున్నారు త్రిమూర్తులు. అప్పటి నుంచి కోర్టుల్లో వాయిదాలు జరుగుతూనే వున్నాయి. కేసు కారణంగా చాలా పదవులకు దూరమైన తోట త్రిమూర్తులు ఈసారి గెలిచి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవాలన్న ప్లాన్‌లో ఉన్నారట. కానీ… ఇంతలోనే కోర్ట్ తీర్పు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలిసింది. దీంతో మండపేట ప్రజాకోర్ట్‌లో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.