NTV Telugu Site icon

Off The Record: తెలంగాణలో ‘టచ్’ పాలిటిక్స్ నడుస్తున్నాయా..?

Otr Telangana

Otr Telangana

Off The Record: తెలంగాణలో ఇప్పుడంతా టచ్‌ సెగలే. టచ్‌ అన్న పదం చుట్టూనే పొలిటికల్‌ గేమ్‌ మొత్తం నడుస్తోంది. ఫలానా పార్టీ వాళ్ళు మాకు టచ్‌లో ఉన్నారని ప్రత్యర్థులు చెబుతుంటే… టచ్‌ చేసి చూడమను… ఏం జరుగుతుందోనంటూ సవాల్‌ విసిరేవాళ్ళు కొందరు. అసలేంటీ టచ్‌ గోల? దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి?

ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఎటువైపు జంప్‌ అవుతారో అర్ధం కాదు. మనసొక చోట, మనువొక చోట అన్నట్టుగా వ్యవహరించే లీడర్స్‌ మరి కొందరు. వేరే చోట ఉన్నాసరే… ఫలానా నాయకుడు మాకు టచ్‌లో ఉన్నారంటూ పార్టీలు చేసే ప్రచారం ఇంకోవైపు…. వెరసి…తెలంగాణలో రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్నే కూల గొడతామని కొందరు తొడలుగొడుతుంటే… అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు మిగిలేది చూసుకోండంటూ వార్నింగ్స్‌ ఇచ్చేవాళ్ళు మరికొందరు. ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళ పర్వంలోకి పాపం ఏ సంబంధం లేని దేవుళ్ళని కూడా లాగేస్తున్నారు మన లీడర్స్‌. అమ్మతోడు అడ్డంగా అందర్నీ లాగేస్తామనే స్టైల్‌ ఒక పార్టీది అయితే… దేవుడి మీదొట్టు మీ సంగతి చూస్తామన్న శపథం మరొక పార్టీది. ఈ పరిస్థితి చూసి మీరూ… మీరూ కొట్టుకోక మధ్యలో మమ్మల్నెందుకు లాగుతార్రా నాయనా అంటూ దేవుళ్ళు సైతం మొత్తుకుంటున్నారన్న సెటైర్స్‌ వినిపిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆడుతున్న మైండ్‌ గేమ్‌, టచ్‌ పాలిటిక్స్‌తో మొత్తం ఒకరకమైన కంగాళీ వాతావరణం మొదలైందన్నది రాజకీయ వర్గాల మాట. గేట్లు తెరిచామని, బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని అంటున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

అదే సమయంలో గులాబీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుగుతున్నాయనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. దాదాపు 25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు టచ్‌ ఉన్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ఇందులో నిజానిజాల సంగతి తేల్చే పనిలో బిజీగా ఉన్నారట కొందరు పొలిటికల్‌ పరిశీలకులు. ఇక అటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా లొల్లి మొదలైంది. తెలంగాణలో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని అంటున్నారట కొందరు కమలం నేతలు. ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని జోస్యం చెబుతున్నారు. అయితే అందుకు కాంగ్రెస్‌ వైపు నుంచి కూడా కౌంటర్స్‌ గట్టిగానే పడుతున్నాయి. టచ్ చెయ్యమనండి… వాళ్లు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకుంటామా? అంటూ రియాక్ట్‌ అవుతున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌. ఆ కోణంలోనే ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ మహేశ్వర్ రెడ్డి వార్‌ నడిచింది.. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మాకు టచ్‌లో ఉన్నారని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అందర్నీ కాదు… ఒక్కర్ని టచ్‌ చేసి చూడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అంటూ రియాక్ట్‌ అయ్యారు మహేశ్వర్‌రెడ్డి. ఇంకా మాట్లాడితే అసలు నువ్వే మా అగ్ర నేతలతో టచ్‌లో ఉన్నావు, పార్టీలో చేరతానని చెప్పావంటూ రివర్స్‌ అయ్యారాయన. అంతే కాదు ఐదుగురు రాష్ట్ర మంత్రులు కూడా బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ బాంబు పేల్చారు మహేశ్వర్‌రెడ్డి. అసలు మా వాళ్ళని ముట్టుకుంటే 48 గంటల్లో మీ ప్రభుత్వాన్నే కూలగొడతామంటూ వార్నింగ్ ఇచ్చారాయన. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మాట ఎలా ఉన్నా… రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య జరిగిన మాటల యుద్ధం మీద కొత్త చర్చ మొదలైంది. నిజంగా బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారా? అలాగే కాంగ్రెస్ మంత్రులు కాషాయం మీద మోజుపడుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. హే… అదంతా తూచ్… పార్టీల మైండ్‌ గేమ్‌ అని కొందరు కొట్టి పారేస్తున్నా… ఏమో.. రాజకీయాల్లో ఏది శాశ్వతం గనుక అనే వాళ్ళు సైతం లేకపోలేదు. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు గంపగుత్తగా పోయి కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదని, రాజా సింగ్ లాంటిలీడర్స్‌ రూటే వేరన్నది విశ్లేషకుల మాట. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కాదని మంత్రులు బీజేపీని ఎందుకు టచ్‌ చేస్తారు? అదంతా సత్యదూరం అన్న వాదన బలంగా ఉంది. ఎవరి వాదనలు, విశ్లేషణలు ఎలా ఉన్నా… ఒకరి మీద ఒకరు పై చేయి సాధించేందుకు ఆడుతున్న మైండ్‌ గేమ్‌ మాత్రం కాక రేపుతోంది. ప్రస్తుతం అంతా ఎలక్షన్‌ మూడ్‌లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇంకా ఎలాంటి రాజకీయ యుద్ధాలు జరుగుతాయో, విజేతలు, పరాజితులు ఎవరో చూడాలి.