NTV Telugu Site icon

Off The Record: టీడీపీ కంచుకోటాను బద్దలు కొట్టేందుకు వైసీపీ కొత్త ప్లాన్.. ఇక రిజల్టే మిగిలింది..!

Tekkali

Tekkali

Off The Record: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కింజరాపు కుటుంబ ఆధిపత్యం స్పష్టంగా‌ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ కంచుకోట ఇది. దీంతో ఈసారి ఎలాగైనా సైకిల్‌ జోరుకు అడ్డుకట్ట వేయాలన్న కసితో కొత్త అస్త్ర శస్త్రాలను సంధించింది వైసీపీ. అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే అందుకు దీటైన అభ్యర్థి కావాలని భావించి…. దువ్వాడ శ్రీనివాస్‌ను బరిలో దించింది. అదే సమయంలో ఇన్నేళ్ళుగా టెక్కలి వైసీపీలో ఉన్న గ్రూప్స్‌ని సెట్‌ చేసింది అధినాయకత్వం. గత ఎన్నికల్లో 8వేల మెజార్టీతో గెలిచారు అచ్చెన్నాయుడు. ఆయనకు వరుస విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయని ఎంక్వైరీ చేసిన వైసీపీ అధిష్టానానికి ఇక్కడ టీడీపీ బలంకంటే వైసీపీ బలహీనతే ప్రముఖంగా కనిపించిందట. అందుకే లోకల్‌ లీడర్స్‌ మధ్య ఉన్న అనైక్యతను గుర్తించి గ్రూప్స్‌ని సెట్‌ చేసి, దువ్వాడను బరిలో దించడంతో ఈసారి గెలుపు ఆశలు పెరుగుతున్నట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు.

Read Also: AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీ..! సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

సామాజిక లెక్కల్ని కూడా సరిచేయడం ఈసారి తమకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్‌ పార్టీ లీడర్స్‌. వీటన్నిటితో పాటు ఇన్నాళ్ళు సెగ్మెంట్‌లోని పదిహేను గ్రామాల్లో అచ్చెన్నాయుడు రిగ్గింగ్ పాల్పడుతూ గెలుస్తున్నారని క్లారిటీకి వచ్చిందట వైసీపీ అధిష్టానం. ఈసారి ఈ ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం, వెబ్ క్యాస్టింగ్ పెట్టించడం ద్వారా రిగ్గింగ్‌ను అడ్డుకోగలిగామని చెబుతున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఈ లెక్కలన్నీ చూసుకుని ఈసారి మా గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నట్టు తెలిసింది. టెక్కలి, నందిగామ మండలాల్లో తాము బలంగా ఉన్నామని, సంతబొమ్మాళి , కోటబొమ్మాళి మండలాల్లో ఓటింగ్‌ను ఈక్వల్ చేస్తే గెలుపు గ్యారంటీ అన్న కేలిక్యులేషన్స్‌తో ఈసారి పనిచేశారట వైసీపీ లీడర్స్‌. ప్రతి సాధారణ ఎన్నికల్లో కోట బొమ్మాళి, సంతబొమ్మాళిలోని కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ జరగడంవల్లే ఓడిపోతున్నామని చెబుతున్న వైసీపీ నేతలు ఈసారి దాన్ని అడ్డుకోగలిగామని అంటున్నారట. ఇలా… ఎవరి లెక్కలు, అంచనాలు వారికి ఉన్నా… ఈవీఎంల ఓపెన్ అయ్యాక గానీ… ఎవరి బలమేంటో, ఎవరి ఎత్తుగడలు ఎంతవరకు ఫలించాయో తెలియదు.