Off The Record: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం తెలంగాణలో కాక రేపుతోంది. పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. వ్యవహారం బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోతోందంటున్నారు. కేసీఆర్ కేబినెట్ ప్రతిపాదించిన రెండు పేర్లను తిరస్కరించారు గవర్నర్ తమిళిసై. దాసోజు శ్రవణ్ , కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ దగ్గరికి పంపింది సర్కార్. అయితే.. ఇద్దరికీ ఆ కోటాలో నామినేట్ అయ్యే అర్హత లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు తమిళిసై. ఈ నిర్ణయంపై భగ్గుమంటోంది బీఆర్‌ఎస్. మంత్రులు, అధికార పార్టీ ముఖ్య నేతలు గవర్నర్ మీద నేరుగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వెనుకబడిన వర్గాల నాయకుల పేర్లను తిరస్కరించారంటూ పొలిటికల్ కలర్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందోనన్న ఆసక్తి కూడా పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆల్రెడీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకున్నందున మరోసారి అవే పేర్లను తిప్పి పంపి మళ్లీ తిరస్కరిస్తే.. రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీని టార్గెట్ చేయాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు.
చాలా రోజుల నుంచి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య మాటల మంటలు పుడుతున్నాయి. అయితే ఇటీవలే సచివాలయంలో దేవాలయాలు,మసీదు,చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు గవర్నర్. దాంతో వివాదాలు సద్దుమణిగాయని అనుకున్నారు అంతా. మళ్ళీ వ్యవహారం మొదటికే రావడంతో గవర్నర్ తీరుపై గుర్రుగా ఉందట అధికార పార్టీ. ఈ వ్యవహారంపై న్యాయ నిపుణులతో చర్చించాక అడుగులు వేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇవికాకుండా ఒకవేళ గవర్నర్ కొత్త పేర్లు పంపితే… తప్పు చేశామని ఒప్పుకున్నట్టు, వెనక్కు తగ్గినట్టు అవుతుందని, అందుకే ఈ రెండు పేర్లనే మరోసారి పంపాలని అనుకుంటున్నట్టు గులాబీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదే సమయంలో మరో వాదన సైతం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడమే అందుకు ఉదాహరణ అంటూ జనంలోకి వెళ్తోంది. ఆ ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారన్న అనుమానంతోనే… రెండు పార్టీలు నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్టుగా అవగాహనతో పనిచేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా వివిధ నియోజకవర్గాల్లో ఇన్నాళ్ళు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ క్రమంగా కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నట్టు అనుమానాలు ఉన్నాయట. అందుకే రెండు పార్టీలు పైకి కయ్యం పెట్టుకుంటున్నట్టే కనిపిస్తున్నాయని, ఎమ్మెల్సీ వివాదం కూడా అందులో భాగమేనన్నది విమర్శకుల మాట. ఎన్నికలకు టైం దగ్గరపడుతున్నందున ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.