Site icon NTV Telugu

Off The Record: పెరుగుతున్న పొలిటికల్‌ హీట్‌.. ఆ నియోజకవర్గంపై పవన్ వ్యూహం ఏంటి..?

Pawan

Pawan

Off The Record: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా, నర్సాపురం లోక్‌సభ పరిధిలో కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్‌గా పేరున్న సీటు భీమవరం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఒక్కసారిగా అందరి పొలిటికల్‌ అటెన్షన్‌ భీమవరం వైపు మళ్ళింది. అప్పుడు గెలుపు ఓటముల సంగతి వేరే స్టోరీ. తిరిగి మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న టైంలో… ఇక్కడ పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు లాంఛనమేనన్న వాతావరణం ఏర్పడటంతో ఇప్పుడు ఈ సీటు మీద పీటముడి బిగుసుకుంటోంది. పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తారా? లేదా ? అన్న విషయంలో క్లారిటీ లేదు. ఆయన అయితే… ఓకే.. కాని పక్షంలో ఇక్కడ పొత్తుల గొడవ పీక్స్‌కు చేరి రచ్చ రంబోలా అయ్యేలా ఉంది. పవన్ పోటీ చేయకుంటే ఈ సీటు మాకు కావాలంటే… మాకే కావాలంటూ స్థానిక టీడీపీ, జనసేన నేతలు జుట్లు పట్టుకునేందుకైనా సిద్ధమేనని అంటున్నారట.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని భావించింది లోకల్‌ కేడర్‌. కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, చివరి నిమిషంలో టిడిపి నాయకులు జనసేనకు సహకరించడం లాంటి ప్రయత్నాలు జరిగినా జనసేనాని గట్టెక్కలేకపోయారు. దాంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పిడికిలి బిగించాలన్న కసితో ఉన్నారు జనసైనికులు. అందుకే…వచ్చే ఎన్నికల్లో మరోసారి పవనే పోటీచేయాలని కోరుతున్నారు. కానీ.. ఈవిషయంలో అట్నుంచి స్పష్టత లేదు. ఒకవేళ ఆయన గనుక ఇక్కడ పోటీ చేయకుంటే…ఈ సీటు ఎవరికి వస్తుందన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. పొత్తులపై జనసేన ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అటు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి తిరిగి పోటీ చేస్తే తమవైపు నుంచి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెప్పేశారు. కానీ… పవన్ పోటీ చేయకుంటే మాత్రం తానే బరిలో ఉంటానని కూడా కుండబద్దలు కొట్టేశారాయన. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులుకు నియోజకవర్గంలో పట్టు ఉంది. టీడీపీ నుంచి ఆయన పోటీచేస్తే విజయం తేలికవుతుందన్న ధీమా క్యాడర్‌లో కూడా ఉంది. ఇదే సమయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు భీమవరం టికెట్ ను ఆశిస్తున్నారు. పవన్ పోటీ చేయకున్నా సరే… ఈ సీటు జనసేనకే కావాలని… బరిలో దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారాయన. ఈసారి భీమవరంలో జనసేన జెండా ఎగరేసి పోగొట్టుకున్న చోటే వెదుక్కుంటామంటున్నారు.
దీంతో టీడీపీ, జనసేన స్థానిక నేతల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైపోయింది.

రెండు పార్టీల నుంచి టిక్కెట్స్‌ ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈసారి భీమవరం సీటు మనమే తీసుకుందాం అంటూ…తమ పార్టీల పెద్దల మీద వత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్‌ పోటీ చేస్తే ఏ గొడవా లేదు. ఆయన కాదంటే మాత్రం స్థానికంగా పొత్తు బంధం తేడా కొట్టడం ఖాయమన్నది లోకల్‌ టాక్‌. ఎందుకంటే… ఇటు జనసేనకు ఇస్తే….టీడీపీ సహకారంపై అనుమానాలున్నాయి. అటు టీడీపీకి ఇచ్చినా…జనసేన ఓట్లు ఎంతవరకు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయోనన్న డౌట్స్‌ గట్టిగానే ఉన్నాయి. ఈ గొడవలో… పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు పరిస్థితి వైసీపీకి అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. పవన్‌కళ్యాణ్‌ నిర్ణయాన్ని బట్టి భీమవరం పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.

Exit mobile version