Off The Record: అనర్హత పిటిషన్స్ విచారణలో భాగంగా… ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. వాళ్ళ నుంచి రిప్లయ్స్ కూడా వచ్చాయి. ఆ సమాధానాల ఆధారంగా… వాళ్ళ మీద వేటేయాలని ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఆ నోటీసులకు సమాధానంగా… ప్రతిపక్షం తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద, చింత ప్రభాకర్ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి….. కాంగ్రెస్ ప్రచార వాహనం ఎక్కి ఇచ్చిన ప్రసంగాలు, రాహుల్ గాంధీని కలిసి దిగిన ఫొటోలను ఆధారాలుగా అసెంబ్లీ అధికారులకు అందించారు. అయితే… అరెకపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్ మీద ఫిర్యాదు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అందుబాటులో లేకపోవడంతో అందుకు సంబంధించిన వివరణ పెండింగ్‌లో ఉంది.
Read Also: Off The Record: ఆ సీనియర్ లీడర్ కమ్ ఎమ్మెల్సీ టీడీపీలో ఉన్నట్టా? లేనట్టా?
స్పీకర్ కి మెయిల్ చేసిన సంజయ్.. కొంత సమయం కావాలని అడిగారట. స్పీకర్ బీఆర్‌ఎస్‌కి ఇచ్చిన నోటీసులకు ఇంకా పూర్తి స్థాయిలో వివరణ రావాల్సి ఉంది. అయితే… ఇప్పటి వరకు వచ్చిన వాటి విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. ఓవైపు ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు ఇవిగోనంటూ బీఆర్‌ఎస్ కొన్ని సాక్ష్యాలను చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం కోసం ఆసక్తిగా చూస్తున్నాయి అన్ని వర్గాలు. పూర్తి స్థాయి విచారణ జరగాలన్న ప్రాసెస్‌లో భాగంగా….. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన సమాధానాలు, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని తిరిగి సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి.. మరోసారి వివరణ కోరే వెసులు బాటు కూడా ఉన్నట్టు సమాచారం. దానం నాగేందర్.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళకి సంబంధించిన వివరణ ఇంకా స్పీకర్‌కు అందలేదు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కొంత గడువు కోరారు వాళ్ళు.
దీంతో…. పూర్తి స్థాయిలో అందరి నుండి వివరాలు అందిన తర్వాతే స్పీకర్ ముందుకు వెళ్తారా..? లేక ఉన్నవాటి విషయంలో నిర్ణయం తీసుకుంటారా? అలాగే.. బీఆర్‌ఎస్ సమర్పించిన ఆధారాల మీద మరోసారి ఎమ్మెల్యేల వివరణలు తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అందుకోసం ఎంత సమయం తీసుకుంటారు లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రావాల్సి ఉంది. దానం.. కడియం, తెల్లం వెంకట్రావు లాంటి వాళ్లకు సంబంధించిన పిటిషన్స్‌పై స్పీకర్… ఫిర్యాదు దారులకు నోటీసులు ఇస్తారా..? ఇస్తే… ఈ ముగ్గురి సమాధానం ఎలా ఉంటుంది? దాని ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లాంటి చాలా అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి… అనర్హత వేటు విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని రెండు పక్షాలు ఉన్న క్రమంలో…. న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి తెలంగాణ రాజకీయవర్గాలు.