NTV Telugu Site icon

Off The Record: మేయర్‌ పదవి ఉంటుందా? ఊడుతుందా?.. అవిశ్వాసంపై ఉత్కంఠ..!

Mayor

Mayor

Off The Record: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలక మండలి ఏర్పడి వచ్చేనెల 11కు నాలుగేళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్స్‌. ఇక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు మేయర్‌. దీన్ని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట. అధికారం కోల్పోయిన సమయంలో అండగా ఉండాల్సిన మేయర్, డిప్యూటీ మేయర్‌ పార్టీని వదిలి వెళ్ళిపోవడంతో… వాళ్ళని ఎలాగైనా గద్దె దింపాలని డిసైడైందట బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. కానీ పాలక మండలికి నాలుగేళ్లు పూర్తవకుండా అవిశ్వాసం పెట్టకూడదన్న నిబంధన కారణంగా… ఇన్నాళ్ళు వేచి చూశారు. ఇప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కొద్ది రోజులుగా అవిశ్వాసం అంశాన్ని ప్రస్తావిస్తున్నారట.

Read Also: Off The Record: సీతక్క అనుచరుల తీరుతో కేడర్ విసిగిపోయిందా?

వచ్చే నెల 11కు బల్దియా పాలక మండలికి నాలుగేళ్లు పూర్తవుతుండటంతో… గులాబీ అధిష్టానం కూడా అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో… అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు 98 మంది సభ్యులు తమ తమ ఫార్మాట్ లో జిల్లా కలెక్టర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌కి వినతి పత్రాలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి బీఆర్‌ఎస్‌కు 71 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో…మరొక పార్టీ కార్పొరేటర్లు మద్దతు ఇస్తే తప్ప…కనీసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టలేని పరిస్థితి. దాని ప్రకారం కార్పొరేషన్‌లో చూసుకుంటే… ప్రస్తుతం పార్టీలు మారిన వారు మినహా బీజేపీకి 41 మంది కార్పొరేటర్లు, ఐదుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 46 మంది బలం ఉంది. అలాగే 41 మంది కార్పొరేటర్లు, తొమ్మిది మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి ఎంఐఎంకు కూడా 50 మంది సభ్యుల బలం ఉంది. ఐతే… రాజకీయ కారణాలతో… బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు తెలిపే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. గతంలో బీఆర్ఎస్‌తో దోస్త్‌ మేరా దోస్త్‌ అన్న మజ్లిస్‌ పార్టీ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌తో చేయి కలిపినట్టు కనిపిస్తోంది. కాబట్టి బీఆర్‌ఎస్‌ అవిశ్వాసానికి ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ లెక్కలు వేసుకునే మేయర్‌ ఇన్నాళ్ళు తన కుర్చీకి ఢోకా లేదని ధీమాగా ఉన్నారట.

Read Also: Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి ఇక్కట్లు.. ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ

కానీ… తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం బల్దియా వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆ మీటింగ్‌ తర్వాత మేయర్‌ శిబిరం కూడా కలవరపడుతున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌తో తమకు రాజకీయ విభేదాలు ఉన్నా… మేయర్ మీద వ్యతిరేకతను చాటుకోవడానికి అవిశ్వాసంలో తమ పాత్ర కూడా చాలా కీలకం అంటూ అవసరమైతే మద్దతిస్తామని అర్ధం వచ్చేలా మాట్లాడారు కార్పొరేషన్‌లో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌. ఆ స్టేట్‌మెంట్‌ బీఆర్‌ఎస్‌కు ధైర్యం ఇస్తుండగా… మేయర్ టీమ్‌కు షాకేనంటున్నారు. బీజేపీ గనుక అవిశ్వాసానికి మద్దతిస్తే… సంఖ్యా బలం 117కు చేరుతుంది. అయినప్పటికీ… మేయర్‌ని గద్దె దింపాలంటే ఆ బలం సరిపోదు. సరిగ్గా ఇక్కడే ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది. పదేళ్ళ అధికార కాలంలో బీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టిన పతంగి పార్టీ…. ఇప్పుడు పాత మిత్రుడి ప్రతిపాదనకు సై అంటుందా లేక కొత్త దోస్త్‌తో ఉన్న అనుబంధం కారణంగా నై అంటుందా అన్నది ప్రస్తుతం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశం. ప్రస్తుతం ఎంఐఎం, కాంగ్రెస్‌ మధ్య బంధం బలంగా ఉందని తెలిసి కూడా… మా ప్లాన్స్ మాకున్నాయని బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ స్టేటెమెంట్స్‌ ఇస్తున్నారంటే…. అది మైండ్‌ గేమా లేక నిజంగానే మజ్లిస్‌ అధిష్టానంతో పాత బంధాన్ని గుర్తు చేస్తూ… రహస్య మంతనాలు జరుపుతున్నారా అన్నది బిగ్‌ క్వశ్చన్‌. ఏది ఏమైనా… ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో అవిశ్వాసం అన్నది పూర్తిగా ఎంఐఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మేయర్‌ పీఠం విషయంలో ఒవైసీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.