Off The Record: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగే కొద్దీ.. అధికార బీఆర్‌ఎస్‌కు కూడా సెగ గట్టిగానే తగులుతోందట. అది కూడా సొంత పార్టీ కేడర్ నుంచే కావడంతోఎమ్మెల్యేలంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రచార పరంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడం ఒక ఎత్తయితే.. సొంత పార్టీ కేడర్‌తోపాటు సాలిడ్ ఓట్ బ్యాంక్ అని భావిస్తున్న కొన్ని వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తి, అసహనాన్ని ఎలా కట్టడి చేయాలో అర్ధంగాక చాలా మంది శాసనసభ్యులు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. తాము ఏవైతే ప్రచారాస్త్రాలు అనుకుంటున్నామో.. అవే రివర్స్ కొడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి స్కీమ్స్ లబ్దిదారుల ఎంపిక కత్తి మీద సాములా మారిందట. ఎంపిక విషయంలో ఇన్నాళ్లు పెద్దగా సమస్యలు లేకున్నా.. ఎలక్షన్ టైంలో లేనిపోని తలనొప్పులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది.
ఈ టైంలో ఎవడి కోసం ఇస్తారన్నట్టుగా… వత్తిళ్ళు రావడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదంటున్నారు. స్థానిక నాయకులు సైతం తమ వాళ్ళకే స్కీమ్స్ అందేలా చూడాలని ఎమ్మెల్యేల మీద వత్తిడి చేస్తుండగా… మరికొంత మంది ఫలానా వాళ్ళకి ఇవ్వవద్దంటూ రివర్స్ పైరవీలు చేస్తున్నారట. అసలే ఎలక్షన్ సీజన్.. ఇన్నాళ్ళు ఎంత నెగ్గించుకున్నా… ఇప్పుడు తగ్గి ఉండాల్సిన టైం వచ్చింది గనుక ఎమ్మెల్యేలు కమ్ అభ్యర్థులు ఏ ఒక్కర్నీ నిరాశపరచకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో కిందా మీదా పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా దళిత బంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కేటాయింపు లాంటి విషయాల్లో చుక్కలు కనిపిస్తున్నాయట బీఆర్‌ఎస్ నాయకులకు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌నే ఉదాహరణకు తీసుకుంటే.. ఈ పరిధిలో ఇప్పటి వరకు మూడు విడతల్లో ఇళ్ళు ఇచ్చారు. డ్రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసినా.. సమస్యలు వస్తున్నాయట. ఇళ్లు వచ్చిన వాళ్లు సంతోషంగా ఉంటే.. ఇన్నేళ్ళు వాళ్ళ పక్కనే ఉండి రాని వారు రగిలిపోతున్నారట. ఆ కోపం పోలింగ్‌బూత్‌లో ఎలా టర్న్ అవుతుందోనన్న బెంగ అభ్యర్థుల్లో పెరుగుతోందంటున్నారు. జీహెచ్‌ఎంసీ లిమిట్స్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను కట్టించి ఇస్తామని గత ఎన్నికల టైంల వాగ్దానం చేసింది బీఆర్‌ఎస్. ఇందులో 87వేల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన 43వేల920 ఫ్లాట్స్‌ని లబ్దిదారులకు కేటాయిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. లక్ష ఇళ్ళ కోసం పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రకరకాల వడపోతల తర్వాత మూడున్నర లక్షల మందిని అర్హులుగా తేల్చారు అధికారులు. అందులో నుంచి లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు.
అయితే… వెరిఫికేషన్ సమయంలోనే తమ పేర్లను కావాలనే తొలగించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొందరు ధర్నాల దాకా వెళ్తున్నారు. కావాలనే అసలు లాటరీలో తమ పేర్లు వేయడం లేదని మరి కొందరు ఆరోపిస్తున్నారు. ఇళ్ళు ఉన్నవాళ్ళకే తిరిగి లాటరీల్లో ఫ్లాట్స్ వస్తున్నాయని, పెద్ద నాయకులకు దగ్గరగా ఉండేవాళ్ళకు తప్ప నిజమైన అర్హతలు ఉన్నవారికి న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఆరోపిస్తూ… ఆందోళనలు చేస్తున్నవాళ్ళలో అధికార పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండటమే ఎమ్మెల్యే అభ్యర్థుల ఆందోళనకు కారణంగా చెబుతున్నారు. వివిధ బస్తీల్లో రోజుకో చోట ఆందోళన జరుగడం ఇబ్బందిగా మారిుతోందట. అన్నిటికీ మించి మా ఏరియాలో కట్టిన ఇళ్ళను మాకు కాకుండా లాటరీల పేరుతో వేరేవాళ్లకు ఎలా ఇస్తారని కొన్ని చోట్ల గొడవలకు దిగడం శివారు శాసనసభ్యులకు మరీ ఇబ్బందిగా మారుతున్నట్టు తెలిసింది. మొత్తంగా ఎన్నికల వేళ సర్కార్ స్కీమ్స్ ప్లస్ అయ్యే సంగతి ఎలా ఉన్నా… దక్కని వారి అసంతృప్తి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన అభ్యర్థుల్లో పెరుగుతోందట. దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.