Site icon NTV Telugu

Off The Record: టికెట్ హామీ దగ్గరే చేరిక ఆగిందా..? లేదంటే..!

Otr Madan Reddy

Otr Madan Reddy

Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీలతో దోబూచులాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే… కండిషన్స్‌తో టెన్షన్‌ పెడుతున్నారు. ఉన్న పార్టీ మీద అలిగారు…. రమ్మన్న పార్టీకి కండిషన్స్‌ అప్లై అంటున్నారు. ఆ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ ఎలా పడుతుందా అని రెండు పార్టీల కేడర్‌ ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకే ఎందుకంత డిమాండ్‌?

చిలుముల మదన్‌రెడ్డి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడని చెబుతారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారాయన. 2018 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలనుకున్న మదన్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు. నర్సపూర్‌ టికెట్‌ ను అప్పట్లో బీఆర్ఎస్‌ చాలా రోజులు పెండింగ్‌లో పెట్టడంతో మార్పు అనివార్యమని, సునీతా లక్ష్మారెడ్డే ఈ సారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అని అందరు ఫిక్స్ అయ్యారు. దీంతో అప్పుడే కాంగ్రెస్‌లోకి వెళ్ళాలనుకున్నారు మదన్‌రెడ్డి. రకరకాల వత్తిళ్లతో ఆగిపోయారు. చివరికి ఆయన్ని ఒప్పించి సునీతా లక్ష్మారెడ్డికే టికెట్ కేటాయించింది పార్టీ. ఎంపీ టికెట్ ఇస్తామన్నది నాటి ఒప్పందం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయినా నర్సాపూర్‌లో పార్టీని గెలవడానికి కీలకంగా పనిచేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో ఇక ఎంపీ టికెట్ ఆయనదేనిన అనుకుంటున్న టైంలో… కొందరి పేర్లు తెర మీదికి వచ్చాయి.

ఫైనల్‌గా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బీఆర్‌ఎస్‌ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి మదన్‌రెడ్డి పార్టీపై గుర్రుగా ఉన్నారు. తాను ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎంపీ ఇస్తామని చెప్పి చివరికి అది కూడా ఇవ్వకుండా పార్టీ తనని రోడ్డున పడేసిందని అనుచరులతో గోడు వెళ్ళబోసుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో భేటీ అయి కాంగ్రెస్‌లో చేరికకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పెద్దలు ఆయనకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కౌడిపల్లిలోని మదన్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే యత్నం చేసినా వర్కౌట్‌ కాలేదని తెలిసింది. హరీష్‌రావుని కలిసిన తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయారట మదన్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో కూడా మెదక్ ఎంపీ సీటు ఇస్తేనే…వస్తానని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ మేటర్‌ దగ్గరే చేరిక ఆగిందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మెదక్ ఎంపీ సీటు బీసీలకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నీలం మధుకు టికెట్ ఖరారు అయినట్టు లీకులు వస్తున్నాయి. అయితే మదన్‌రెడ్డితో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలు ఎంపీ టికెట్ హమీ ఇస్తే పార్టీలో చేరుతామని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో టిక్కెట్‌ ఇస్తేనే ఆయన పార్టీలో చేరతారా? లేక కాంగ్రెస్‌ పెద్దలు కన్విన్స్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మదన్‌రెడ్డి మాత్రం ఇటు బీఆర్‌ఎస్‌ పెద్దల మాట వినకుండా..అటు కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ టికెట్ కండిషన్ పెట్టి రెండు పార్టీలను టెన్షన్ పెడుతున్నారట. మరి ఈ కథ కంచికి చేరుతుందా లేదా అన్నది చూడాలి.

 

Exit mobile version