Off The Record: సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం…టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. ఆ సమయంలో తుని రైలు దహనం కేసు నమోదైంది ఆయన మీద. మేలో ఆ కేసును కోర్ట్ కొట్టేసింది. దీంతో ఈ ఎన్నికల సీజన్‌లో రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారాయన. ఈ క్రమంలోనే ముద్రగడ సంధించిన లేఖాస్త్రంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం సర్పవరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా ముద్రగడ ప్రస్తావన తీసుకువచ్చారు. కాపు కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనీయడం లేదని.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు తగ్గడం, పెరగడం ఉండకూడదంటూ చెప్పాలనుకున్నది చెప్పేశారు.. యువతని వాడుకుని వారి భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకుల వెంట వెళ్ళాలో, లేదో మీరే డిసైడ్ చేసుకోవాలని అన్నారు… కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నావారు ఎప్పుడూ ఒకటే మాట మాట్లాడాలని అటాక్ చేశారు జనసేనాని.
Read Also: Off The Record: పార్టీ మారుతున్నారా..? మార్కెటింగ్ చేసుకుంటున్నారా..?
పవన్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నది నేరుగా చెప్పకున్నా…ముద్రగడకు మాత్రం గట్టిగానే గుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన పవన్‌ను ఉద్దేశించి లేఖాస్త్రం సంధించారని అంటున్నారు. నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని, యువత భావోద్వేగాలతో పబ్బం గడుపుకోవడం లేదని అందులో రాశారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదంటూ ఆయన కూడా గట్టిగానే చెప్పాల్సింది చెప్పేశారు… నేను ఉద్యమాన్ని వదిలేశాను సరే….. మీరెందుకు కాడి అందుకుని నడిపించడం లేదని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ భాష పై కూడా అభ్యంతరం తెలిపారు ముద్రగడ. వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ… వారాహి యాత్రలో ప్రస్తావించిన అంశాలకు పిన్ టు పిన్ కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా ద్వారంపూడిపై చేస్తున్న కామెంట్లను కూడా ప్రస్తావించారు… చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి ఆయనపై పోటీ చేసి సత్తా చూపాలన్నారు. 175 స్థానాలలో పోటీ చేసే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలనడం ఏంటని సెటైర్లు వేశారు ముద్రగడ.. ఇప్పటిదాకా పద్మనాభం ఎక్కడా పవన్‌కళ్యాణ్‌ని నేరుగా కలిసింది లేదు. కాపు ఉద్యమ సమయంలో పవన్ మద్దతు ఇస్తారని ముద్రగడ ఆశించారట. కానీ.. అలా జరగలేదన్న అసహనం ఆయనలో గూడుకట్టుకుని ఉన్నట్టు చెబుతున్నారు అనుచరులు. దానికి తోడు ఇప్పుడు జిల్లా పర్యటనలో కుల పెద్దగా తనను కలుస్తారేమోనని అనుకున్నారట. అది కూడా జరగకపోయేసరికి ఇక అసహనం కట్టలు తెంచుకుందని చెబుతున్నారు.
Read Also: Off The Record: బీఆర్ఎస్‌కు కొందరు కార్పొరేటర్లు కంట్లో నలుసులా మారారా?
గతంలో జనసేన ఉత్తరాంధ్ర నేతలు ముద్రగడను కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారట.. మద్దతు ఇవ్వాలని వాళ్లు అడిగితే…. అసలు మీ సారు మమ్మల్ని కలిస్తే కదా…అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. పవన్‌కు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మద్దతు కోసం ముద్రగడ ఇప్పుడు స్టాండ్ మార్చారన్నది లోకల్ టాక్. అందుకే ఈసారి డైరెక్ట్ అటాక్ చేసేశారన్న చర్చ జరుగుతోంది. తన పొలిటికల్ రీ ఎంట్రీ కోసం ఇలా అడ్డం తిరిగి హైప్ అయ్యే ప్రయత్నం చేశారని చెప్పుకుంటున్నారు.. అందుకే సూటిగా సుత్తి లేకుండా తన భావాలను బయటపెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ముద్రగడ రీ ఎంట్రీ రాజకీయం మొదలుపెట్టేశారు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే తన ఉనికి ని , అవసరాన్ని గుర్తు చేసే పనిలో పడ్డారు. పొలిటికల్ లెక్కల్ని సరిచేసే క్రమంలో ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.