Off The Record: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్…. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన శ్రీధర్…. తరచూ చింతలపూడి రాజకీయాల్లో వేలుపెడుతూ వార్తల్లోకెక్కుతున్నారు. కానీ… ఇటీవల అందుకు భిన్నంగా వేరే విషయంలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈసారి ఎలక్షన్స్ గురించి ఎవరు ఆయన దగ్గర ప్రస్తావించినా… ప్లీజ్… నన్ను వదిలేయండి అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని, మీరంతా ఎప్పటిలాగే నాతో ఉండాలని సన్నిహితులకు నచ్చజెప్పుకుంటున్నట్టు తెలిసింది. ఇదే ఇప్పుడు ఏలూరు లోక్‌సభ సీటు పరిధిలో హాట్ టాపిక్ అయింది. ఏంపీ నిజంగానే తప్పుకుంటున్నారా? లేక తప్పిస్తున్నారా? అన్న చర్చ మొదలైంది. రాజకీయ వారసత్వం, వైసీపీ హవా కలిసి రావడంతో గత ఎన్నికల్లో గెలిచిన శ్రీధర్ నియోజకవర్గం మీద తన మార్క్ వేయలేకపోయారన్న పెదవి విరుపులు ఎక్కువగానే ఉన్నాయి.
తండ్రి కోటగిరి విద్యాధరరావు చింతలపూడి నుంచి ఓటమిలేని నేతగా పేరుతెచ్చుకున్నా… శ్రీధర్ వ్యవహారం ఆ స్థాయిలో లేదన్నది లోకల్ టాక్. ఆధిపత్యపోరుపై పెట్టిన శ్రద్ధ అవకాశాలను ఉపయోగించుకోవడంపై పెట్టలేదన్నది ఆయన మీదున్న ప్రధాన విమర్శ. ఈ పరిస్థితుల్లో నన్ను వదిలేయండని తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుచర గణాన్ని అయోమయంలో పడేస్తుంటే. సొంత పార్టీలోనే ఉన్న వ్యతిరేక వర్గానికి మాత్రం హ్యాపీగా ఉందట. వచ్చే ఎన్నికల్లో తాను వందకి వందశాతం పోటీ చేయబోనంటూ మైక్ దొరికినప్పుడల్లా చెప్పేస్తున్నారు ఎంపీ. ఇటీవల భీమవరంలో జరిగిన వెలమ సంఘం ఆత్మీయ సమావేశంలోనూ అదే విషయాన్ని రిపీట్ చేశారాయన. తప్పుకోవడానికి కారణం… కుటుంబానికి దూరం కావడమేనని చెబుతున్నారాయన. ప్రత్యర్థివర్గం మాత్రం… అసలు మేటర్ వేరే ఉందని, ఆయనకు రాజకీయం చేతకావడంలేదని ప్రచారం చేస్తోంది. నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా… పార్టీ కార్యక్రమాలకు పరిమితం అవడం తప్ప… రాజకీయ భవిష్యత్ మీద ఆశ ఉన్న నాయకుడిగా ఒక కార్యాచరణ అంటూ లేదని అంటున్నారట పార్టీలోనే ఉన్న ప్రత్యర్థులు. తన పరిధిలోకి వచ్చే చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో మాత్రం తరచూ వేలుపెడుతూ అక్కడ కూడా వ్యతిరేకతను పెంచుకున్నారంటున్నారు.
అక్కడ ఎమ్మెల్యే విఆర్ ఎలిజాకు వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేసుకున్న శ్రీధర్…ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం బాగా మైనస్ అయిందన్న వాదన ఉంది. ఒకే పార్టీ అయినా… ఎంపి వర్గం, ఎమ్మెల్యే వర్గం అంటూ నేతలు రోడ్డెక్కి బాహాబాహికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంపీగా ఉన్న అధికారాన్ని ఎలీజాను ఇబ్బంది పెట్టడానికి తప్ప అభివృద్ధి పనుల కోసం వాడలేదని కూడా విమర్శిస్తోంది ఎంపీ వ్యతిరేక వర్గం. ఈ వ్యవహారాలన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ టిక్కెట్ ఇవ్వరు కాబట్టి ముందుగానే నాకు వద్దంటూ కొత్త రాగం అందుకున్నారని ప్రచారం చేస్తోంది ఆ వర్గం. రాజకీయాల్లో ఉంటానని ఓవైపు చెబుతూనే…. పోటీకి మాత్రం సిద్దపడకపోవడంపై ఎంపీ సొంత వర్గం సైతం అయోమయంలో ఉందట. ఇంతకాలం ఆయన్ని నమ్ముకుని ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసినా.. చివరికి ఉపయోగం లేకుండాపోతోందంటూ ఆవేదనగా ఉందట ఆయన వర్గం. ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్న శ్రీధర్ రాజకీయాల్లో కొనసాగుతానని మాత్రం చెప్పడానికి కారణం తనకు కాస్తోకూస్తో పట్టున్న చింతలపూలో పైచేయి సాధించడానికేనన్న వాదనా ఉంది. మరి ఎంపీ శ్రీధర్ ఆఫ్‌లైన్ రాజకీయాలు ఎలా ఉంటాయో… చూడాలంటున్నారు పరిశీలకులు.