Off The Record: గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న లే అవుట్లను అక్రమ ప్లాట్లుగా నిర్ధారిస్తూ, వాటిని క్రమబద్ధీకరించుకోవాలంటూ 2006లో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రిజిస్ట్రేషన్స్, భవన నిర్మాణ అనుమతులతో స్థానిక సంస్థలకు కూడా ఆదాయం సమకూరింది. ఇక పల్లెలు, పట్టణాల్లో స్థలాల క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని భావించింది. అక్రమ లే అవుట్లలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు కేసీఆర్ ప్రభుత్వం ఆగస్టు 31, 2020న జీఓ ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది.
అయితే… బీఆర్‌ఎస్ ఎస్‌ఆర్‌ఎస్‌పై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా ఆరోపణలు చేసినా.. అంతిమంగా తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ని రద్దు చేసి… పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా ప్లాట్లు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా… ఇప్పటిదాకా ఆ ఊసే లేదంటూ… విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా చాలా మీటింగ్స్‌లో ఈ విషయం చెప్పారని, ఇప్పుడు ఆయన కూడా మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు 25 శాతం రాయితీ పేరిట పేదోడిపై లక్షల రూపాయల భారం మోపి… రాష్ట్ర ప్రభుత్వం 50 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే ప్రయత్నంలో ఉందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. మార్చి 31లోపు దరఖాస్తు ఫీజులు చెల్లించాలని ప్రకటించడం వెనక ఖజానా నింపుకోవాలనే ఉద్దేశమే తప్పా.. సామాన్యులకు లబ్ధి చేయాలన్న ఆలోచన ఏ మాత్రం లేదని మండిపడుతున్నారు విపక్ష నాయకులు. అయితే… ప్రభుత్వ ఆలోచన వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మారిదిగా…
ఒక్కో దరఖాస్తు కాకుండా ఒక్కో ప్రాంతం ఆధారంగా అక్కడ ఉన్న లే అవుట్లన్నింటినీ ఒకేసారి వేర్వేరు విభాగాల అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. కాస్త ఆలస్యం అయినా… తక్కువ వ్యవధిలో ఎక్కువ దరఖాస్తుల్ని క్లియర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏతోపాటు, నగర శివారులో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తంగా 7లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయడం ద్వారా.. ఖజానా నింపుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. 2020 నుంచి ఆఫీసుల్లో మగ్గుతున్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు… వచ్చే మార్చి 31లోగా ఫీజులు చెల్లించుకోవాలని, 25 శాతం రాయితీనిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీని చుట్టూనే ఇప్పుడు రాజకీయ రగడ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి రాబడి అంత ఆశాజనకంగా లేదు. ఎప్పటికప్పుడు అప్పుల తిప్పలు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో రావడం లేదని మంత్రులు వాపోతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటూ వత్తిడి పెరుగుతోంది. దీంతో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాల సందర్భంగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ పాత ఫైళ్ళ దుమ్ముదులపడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇలా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల రూపంలో వచ్చే సొమ్ము తాత్కాలిక ఉపశమనం ఇస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరికొన్ని ఆదాయ మార్గాలను వెదికే పనిలో ఉందట తెలంగాణ సర్కార్. మరి ఎల్ఆర్‌ఎస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.