Off The Record: తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నట్టా? లేనట్టా? అసెంబ్లీ ఎన్నికల నాటి సహకారం ఈసారి కూడా ఉంటుందా? లేదా? అసలు కామ్రేడ్స్ ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ నాయకత్వం మనసులో ఏముంది? అసెంబ్లీకి, ఇప్పటికి వచ్చిన మార్పేంటి? వాళ్ళు దోస్తులా ? దుష్మన్‌లా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు పెట్టుకుని పని చేసింది కాంగ్రెస్. కొత్తగూడెం సీటును కేటాయించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాసరే… పొత్తు ధర్మంలో భాగంగా ఇవ్వడం, సమన్వయంతో కలిసి పనిచేసి సీపీఐ గెలవడం తెలిసిందే. అలాగే కమ్యూనిస్ట్‌లు బలంగా ఉన్న కొన్నిచోట్ల కాంగ్రెస్‌కి కూడా వర్కౌట్ అయింది. ఇలా రెండు పార్టీలు పరస్పరం లాభపడ్డాయి. కానీ… లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ సుహృద్భావం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటివరకు రెండు పార్టీల మధ్య ఎంపీ ఎలక్షన్స్ గురించి అసలు సంప్రదింపులే జరగలేదు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లోనే… తమకో సీటు కావాలని డిమాండ్ చేసింది సీపీఐ. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకున్నా… ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వాములం కాబట్టి… మాకో సీటు అంటోంది సీపీఎం. కానీ రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఈ రెండు పార్టీల డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారాలను జాతీయ నాయకత్వమే చూసుకుంటోంది. కాబట్టి ఉభయ కమ్యూనిస్టుల జాతీయ నాయకత్వాలు ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి సీట్ల సర్దుబాటు చేసుకోవాలనేది టీ పీసీసీ ఆలోచనగా తెలిసింది. పొత్తుల అంశంపై జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటామని ఇటీవల స్పష్టం చేసింది సీపీఐ.
అంటే… పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీ సీటు డిమాండ్ నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక సిపిఎం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రానందున ఇప్పుడు పిలిచి టికెట్ ఇచ్చే ఆలోచనలో లేదు కాంగ్రెస్. ఇప్పటికే సిపిఎం భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది. అయినా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. భావ సారూప్యత ఉన్న పార్టీలను కలుపుకుని పోవాలని అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రయత్నించింది కాంగ్రెస్. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదన్నది ఇంటర్నల్ టాక్. సీటు విషయంలో ఇప్పుడు సిపిఐ కొంత వెనక్కి తగ్గినా… ఉభయ కమ్యూనిస్టులతో కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడటం లేదన్న అసంతృప్తి మాత్రం కనిపిస్తోంది. నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు ప్రభావం ఎక్కువ. అందుకోసమైనా… కాంగ్రెస్ పెద్దలు కమ్యూనిస్ట్‌లతో సంప్రదింపులు జరిరిపితే మంచిదన్న చర్చ జరుగుతోంది. అయితే… అభ్యర్థుల ఎంపిక మొత్తం పూర్తయ్యాక ప్రచారంలో మిగతా పార్టీలను కలుపుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలిసింది. ఏదేమైనా కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీలు కలిసి నడిస్తే… ఉభయ పక్షాలకు మంచిదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓట్లు చీలిపోతే వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సి ఉంటుందన్న మాట కూడా వినిపిస్తోంది. సూచనలు, సలహాల సంగతి ఎలా ఉన్నా… కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తమను సంప్రదించలేదన్న అసహనం మాత్రం కమ్యూనిస్ట్ పార్టీల్లో కనిపిస్తోంది. దీంతో వాళ్ళు దగ్గరా దూరమా అన్న డౌట్స్ కూడా పెగురుతున్నాయి.