Off The Record: పంచకర్ల రమేష్ బాబు…! గండి బాబ్జీ…! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు…కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేసే విషయంలో ఎవ్వరూ తగ్గడం లేదట.ఇందుకు బలం చేకూర్చే సంఘటనలు పెందుర్తిలో జరుగుతుండటం ఆసక్తి రేకెత్తిస్తుండగా… లోకల్‌గా కూటమిలో కుంపట్లు మొదలయ్యాయనే విశ్లేషణలు సైతం బయలుదేరుతున్నాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని బహిష్కరించారు. గన్‌మెన్ లేకుండానే నియోజకవర్గంలో రెండు నెలల నుంచి ఎమ్మెల్యే తిరుగుతున్నా… పోలీస్ అధికారులు ఆ దిశగా ద్రుష్టి సారించలేదట. దీంతో… జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు లభిస్తున్న గౌరవానికి ఇదో ఉదాహరణ అంటూ కొత్త మాటలు వినిపిస్తున్నాయట. అధినేత ఆదేశాలకు లోబడి ఇబ్బందుల్ని అధిగమిస్తున్నామని, రోజు రోజుకీ అవమానకర పరిస్ధితులు స్రుష్టిస్తుంటే ఎన్నిరోజులు మౌనం వహించాలో అర్ధం కావడంలేదంటూ పెందుర్తి జనసేనలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Honda Activa EV: త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. టీజర్ విడుదల
2024 అసెంబ్లీ ఎన్నికల్లో గండి బాబ్జీ, పంచకర్ల రమేష్ బాబు ఇద్దరు పెందుర్తి టిక్కెట్ ఆశించారు. చివరికి పొత్తులో జనసేనకు వెళ్ళడంతో పంచకర్లకు ఛాన్స్ దక్కింది. ఇక ఎన్నికల తర్వాత కేడర్ నిలబెట్టుకునే దిశగా ఇద్దరు నేతలు వ్యూహాలకు పదును పెట్టడంతో వ్యవహారం సెగలు పొగలు కక్కుతోంది. అగ్గికి ఆజ్యం పోసినట్టు ఇటీవల జరిగిన సీఐల బదిలీలు మరింత రచ్చకు కారణం అయ్యాయట. నియోజకవర్గంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ స్టేషన్లకు ఒక్కో పేరు చొప్పున ఇచ్చారట ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. అయితే…పోలీసు అధికారులు అందులో ఒక్క పేరును కూడా ఆమోదించకుండా… వేరే వారిని సీఐలుగా నియమించారు. దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారట ఎమ్మెల్యే. దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన బలంగా అనుమానిస్తుండటంతో… వ్యవహారం ముదిరు పాకానపడిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్నారు పంచకర్ల. ఆ పార్టీ తరపున పెందుర్తి టిక్కెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. దీంతో జనసేనలో చేరి కూటమి అభ్యర్ధిగా బరిలోకి దిగితే భారీ మెజార్టీ లభించింది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కూడా ఉన్న పంచకర్ల పెందుర్తికి పాతకాపే కావడంతో పట్టు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక పెందుర్తి నియోజకవర్గానికే చెందిన గండి బాబ్జీది డిఫరెంట్ స్టోరీ. ఆయన కూడా కాంగ్రెస్, వైసీపీ మీదుగా టీడీపీ గూటికి చేరిన వారే. 2019ఎన్నికలకు ముందు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు గండి.
Read Also: Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. ‘‘లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్’’ సక్సెస్..
ప్రస్తుతం పెందుర్తి టీడీపీ ఇన్చార్జ్ గా గండి బాబ్జీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు ఆధిపత్యం కోసం వేస్తున్న ఎత్తులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల అయినా… ప్రభుత్వ వర్గాల నుంచి బాబ్జీకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందన్న కారణంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రోటోకాల్‌తో అధికారిక రివ్యూలు చేస్తున్నారు పంచకర్ల. కానీ ఎలాంటి ప్రోటోకాల్ లేని గండి బాబ్జీ…ఇటీవల సమీక్షల్లో కూర్చుంటుండటం ఇబ్బందిగా మారుతోందట. ఆయన ఏ హోదాలో వచ్చారో చెప్పాలని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఇలాంటి పరిస్థితుల్లో… బాబ్జీకి తాజాగా ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో మాదిరి ఇప్పుడు కూడా కార్పొరేషన్లకు ప్రోటోకాల్ ఇస్తే గండి వెర్సస్ పంచకర్ల కేంద్రంగా పెందుర్తి పంచాయితీ మరింత రసవత్తరంగా మారుతుందని అంటున్నారు.