Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకు, అందులోనూ ప్రత్యేకించి టీడీపీ వాళ్ళకు ఏమైందని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడమే కాకుండా కనీసం వైసిపి విమర్శలకు సైతం కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా ఎందుకు ఉండటం లేదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి. జిల్లాలో మొత్తం 14 సీట్లకు గాను గత ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంది కూటమి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు వచ్చినా… జిల్లా టీడీపీ నాయకుల ముఖాల్లో మాత్రం సంతోషం కనిపించడం లేదట. ఏడాది కాలంగా ఇటు సీనియర్లు ఇటు జూనియర్లు మాకెందుకులే అన్నట్టు నిరాశ, నిస్పృహల్లో ఉండిపోతున్నారు. దీని కోసమేనా నాడు వైసీపీ నేతలతో మేం పోరాడింది అంటూ… కేడర్ తలలు బాదుకుంటున్నట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన మాకు పదవులు రాదేలదని సీనియర్ నేతలైన అమరనాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మౌనంగా ఉండిపోతే….. మిగిలిన యువ ఎమ్మెల్యేలు సైతం మాకెందుకులే అన్నట్లుగానే అసంతృప్తితో ఉన్నారట. పైచేయి సంగతి తర్వాత… జిల్లాలో వైసిపి నేతలు దూకుడుకి సరి సమానంగా కూడా జిల్లా ఎమ్మెల్యేలు పోటీ పడలేకపోతున్నారని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణగా మామిడి ఎపిసోడ్‌ని చెబుతున్నారు.
Read Also: Off The Record: ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ..? సీఎం చంద్రబాబు సీరియస్‌గా దృష్టి పెట్టారా?
జిల్లాలో ఏటా సుమారు రెండు లక్షల హెక్టార్లలో మామిడి పంట పండుతుంది. అందులో 80 శాతానికి పైగా తోతాపురి రకమే. అయితే ఈసారి జిల్లా చరిత్రలో రానంతగా దిగుబడి పెరగడంతో… సమస్య మొదలైంది. గిట్టుబాటు ధర రాక నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అంతకంటే ముందే… ఏప్రిల్ లోనే జిల్లా ఎమ్మెల్యేలు అంతా కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరను నాలుగు రూపాయలుగా, ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలుగా.. మొత్తం 12 రూపాయలు రైతులకు వచ్చేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ… ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను సకాలంలో తెరవకపోవడంతో అత్యధికంగా వచ్చిన పంటను ఏం చేయాలో తెలియక రోడ్డున పడ్డారు రైతులు. ఏ ఫ్యాక్టరీ దగ్గర చూసినా పంటను తీసుకువచ్చిన ట్రాక్టర్ల బారులే కనిపించాయి. ఇక్కడే తన వ్యూహానికి పదును పెట్టింది వైసీపీ. రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ… ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి, భూమన, రోజా లాంటి వైసీపీ ముఖ్యులు. ఇక ఈ నెల తొమ్మిదిన మామిడి రైతుల పరామర్శ కోసం ఏకంగా పార్టీ అధ్యక్షుడు జగన్ బంగారు పాళ్యం టూర్ పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మౌనంగా ఉండడంపై తీవ్ర స్థాయిలో అగ్రహంగా వ్యక్తం అవుతోంది కేడర్‌లో. గిట్టుబాటు ధర కల్పించడానికి తాము ముందే కలెక్టర్‌ని కలిసి చేసిన ప్రయత్నాన్ని, తీసుకున్న నిర్ణయాన్ని, ఇప్పుడు కూడా ఎందుకు గట్టిగా చెప్పుకోలేకపోతున్నారని రగిలిపోతున్నారట తమ్ముళ్లు. మామిడి రైతులకు మేలు చేసేలా 8 రూపాయలు ఫ్యాక్టరీ ధర అయితే…ప్రభుత్వం మరో నాలుగు కలిపి ఇస్తున్న విషయాన్ని రైతుల్లోకి ఎందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారంటూ నిలదీస్తున్నారు.
Read Also: Delhi : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటనా స్థలంలో 13 అగ్నిమాపక యంత్రాలు..
అలాగే… జిల్లా రైతులకు అన్యాయం జరక్కుండా….కర్ణాటక, తమిళనాడు నుంచి తోతాపురి మామిడి రాష్ట్రంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని, మా రైతులకు అన్యాయం చేయవద్దంటూ కర్ణాటక ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన విషయాన్ని కూడా జిల్లా ఎమ్మెల్యేలు మర్చిపోయారా అంటూ మండిపడుతున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. ముఖ్యంగా జీడీ నెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేల తీరు మరింత ఆగ్రహాన్ని తెప్పించేలా ఉందంటున్నారు తమ్ముళ్లు.. జిల్లాలో ఎక్కువగా పంట పండేది ఈ రెండు నియోజకవర్గాల్లోనే. ఇందులో కూడా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ తీరు మరింత వివాదాస్పదం అయింది. ఓ వైపు పంటను కొనేదిక్కు లేదు, పాడైపోతోంది, ఏం చేయాలో అర్ధం కావడం లేదని రైతులు ఏడుస్తుంటే… ఆయన మాత్రం… భారీ ఎత్తున, ఇంకా చెప్పాలంటే ఒక తిరునాళ్లలాగా పుట్టిన రోజులు వేడుకలు జరుపుకోవడం ఏంటని మండిపడుతున్నారట నియోజకవర్గంలో. చివరికి వైసీపీకి కౌంటర్స్ వేయడం ఎలాగూ మీకు చేతకాదు… కనీసం చేసిందన్నా చెప్పుకోండయ్యా… అనే పరిస్థితికి వచ్చారట టీడీపీ కార్యకర్తలు. ఇదే విషయాన్ని రెండు రోజుల పర్యటన కోసం కుప్పం వచ్చిన సీఎం చంద్రబాబుకు పలువురు సీనియర్ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆఖరికి కుప్పంలో చంద్రబాబు స్పందించినా… జిల్లా ఎమ్మెల్యేలకు మాత్రం నోరు పెగలడం లేదు… వాళ్ళు పూర్తిగా కాడి పడేశారా అని మాట్లాడుకుంటున్నారట. అంటే… వీళ్లకు కోరుకున్నట్టు పదవులు ఇస్తేనే నోరు లేస్తుందా? లేదంటే…. గొంతుకు తోతాపురి మామిడి ముక్కలు అడ్డుపడతాయా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారట కొందరు టీడీపీ నాయకులు. పరిస్థితి ఇలానే ఉంటే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు చెక్ పడుతుందన్న వాదన బలపడుతోంది. రేపు జగన్ టూర్ నాటికన్నా… వీళ్ల నోళ్ళు తెరుచుకుంటాయా, లేక వదిలేస్తారా అని మాట్లాడుకుంటున్నారట తమ్ముళ్లు.
