NTV Telugu Site icon

Off The Record: తెలంగాణలో ఎల్పీ విలీనాల పర్వం.. బీఆర్‌ఎస్‌లో భూకంపం..!?

Brs

Brs

Off The Record: పార్టీ ఫిరాయింపులు, ఎల్పీల విలీనాలు తెలంగాణలో కొత్తేం కాదు. 2014 నుంచి 2023 వరకు ఇదే తంతు కొనసాగింది. అదేదో… ఆనవాయితీ అన్నట్టుగా… ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్‌ స్ట్రాటజీ ఫాలో అవుతోంది. గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌… ఓసారి తెలుగుదేశం లెజిస్లేచర్‌ పార్టీని, మరోసారి కాంగ్రెస్‌ ఎల్పీని విలీనం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తోవలో నడుస్తున్నట్టు కనబడుతోందంటున్నారు పరిశీలకులు.ఈసారి రాష్ట్లంలో అధికార మార్పిడి జరిగాక ఇప్పటివరకు 9 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Read Also: Viral Video: ఇండియన్ ఫుడ్ తిన్న మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ విక్రేత..ఆస్పత్రి పాలయ్యాడు..

దీనిపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతున్నా… కాంగ్రెస్‌ మాత్రం పిచ్చ లైట్‌ తీసుకుంటోంది. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది, లేని ఆలోచనను రేకెత్తించిందే బీఆర్ఎస్, బీజేపీ అంటూ.. రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టారు కాంగ్రెస్‌ నేతలు. పూర్తిస్థాయి మెజారిటీ వచ్చినా సరే… పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు, దానంతటదే కూలిపోతుందని మరికొందరు కామెంట్స్‌ చేశారు. దీంతో అలర్ట్‌ అయిన సీఎం రేవంత్ రెడ్డి… ఎన్నికల ఫలితాల తర్వాత ఫిరాయింపులు ఉండవని చెప్పిన మాటను పక్కనబెట్టి… ముప్పు తొలగించుకునే పని మొదలుపెట్టారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి ఈ ఫిరాయింపుల పర్వానికి తెరలేచింది. ఇప్పుడది క్రమంగా ఊపందుకుంటోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను ఈ విడత అసెంబ్లీ సమావేశాలకంటే ముందే…లాగేసుకోవాలన్నది కాంగ్రెస్‌ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. గతంలో తమ సీఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నట్టుగానే… ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎల్పీని తాము కలిపేసుకోవాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం అట.

Read Also: Anant Ambani Wedding: ధోని ఫొటోలు దిగుతుండగా వెయిట్ చేసిన అమితాబ్ బచ్చన్

అనుకున్నట్టుగా విలీనం జరగాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కానీ ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరారు. మరో రెండు వారాల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. మరి ఆలోపే మిగతా ఎమ్మెల్యేల కండువాల మార్పిడి సాధ్యమా? అనుకున్నంత తేలిగ్గా అంత మంది చేరికలు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు పార్టీ వర్గాల్లో.. అయితే ఇప్పటికే పూర్తిస్థాయిలో పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను సెట్‌ చేసి పెట్టుకున్నారన్న వాదన సైతం వినిపిస్తోంది. ఎమ్మెల్యేల చేరిక ఒకే అయితే… తర్వాత మండలి మీద కూడా దృష్టి పెట్టబోతున్నట్టు తెలిసింది. శాసనమండలిలో కాంగ్రెస్ కి పూర్తిస్థాయిలో బలం లేదు. వచ్చే సమావేశాల్లో మండలి చైర్మన్ పై బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం పెట్టాలనుకుంటోందట. దీంతో ఎమ్మెల్సీల చేరికను కూడా సీరియస్‌గానే తీసుకుని వర్కౌట్‌ చేయాలనుకుంటున్నారట కాంగ్రెస్‌ పెద్దలు. ఇటు అసెంబ్లీ, అటు మండలిలో ఏకకాలంలో బీఆర్‌ఎస్‌ ఎల్పీలను విలీనం చేసుకోవాలన్న ఎత్తుగడను అమలు చేయాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రోజుకో ఎమ్మెల్యేని చేర్చుకుంటూ… మైండ్‌ గేమ్‌ మొదలుపెట్టింది కాంగ్రెస్‌. మరి అసెంబ్లీ సమావేశాల లోపు పని ముగించాలన్న ప్లాన్‌ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.