Off The Record: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు జోరుగా నడుస్తున్నాయి. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న లెక్కల్లో ఎవరికి వారు మునిగితేలుతున్నారు. ప్రతిపక్షం బీఆర్ఎస్లో దీనికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. తొలి విడతలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1144 చోట్ల గెలిచారు. ఈ నంబర్ని ఆ పార్టీ అస్సలు ఊహించలేదట. దీంతో మిగతా రెండు విడతల్లో జాగ్రత్తలు తీసుకుని సత్తా చాటాలనుకుంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అర్బన్ ఏరియాలో ఫర్వాలేదని అనిపించినా… రూరల్లో మాత్రం గట్టి దెబ్బ పడింది. పార్టీని అధికారానికి దూరం చేసింది కూడా గ్రామీణ ఓటర్లేనన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అనుకోకుండా వెయ్యికి పైగా గ్రామాలు దక్కడం గులాబీ వర్గాల్లో ఆశలు పెంచిందట. ఇక గ్రామాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Hyderabad: భర్తతో గొడవ.. నవవధువు ఆత్మహత్య
గ్రామాల్లో మొదటి ప్రజాప్రతినిధిగా ఉండే సర్పంచ్ అభ్యర్థులను మరింత మందిని గెలిపించుకోగలిగితే రేపు ప్లస్ అవుతుందన్న దృష్టితో… మిగతా రెండు విడతల మీద ఫోకస్ పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసం బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నచోట ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నారట. తొలి విడత ఎన్నికల మీద పార్టీ అధిష్టానం అంతగా శ్రద్ధ పెట్టకున్నా, ఫోకస్ చేయకున్నా వెయ్యికి పైగా పంచాయతీల్ని గెల్చుకోవడాన్ని గొప్పగా భావిస్తోందట గులాబీ నాయకత్వం. అందుకే తర్వాత జరగబోయే రెండు విడతల మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లను గైడ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. మొదటి విడత కంటే మెరుగ్గా రెండు మూడు ఫేజ్లలో ఫలితాలు రాబట్టే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఊపును ఇలాగే కంటిన్యూ చేసి రేపు పార్టీ గుర్తుల మీద జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీలో కూడా సత్తా చాటాలనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. కారు పార్టీని రూరల్ తెలంగాణ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటుందో చూడాలి మరి.