Messi-CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అద్భుతంగా ముగిసింది. ఈ చారిత్రక ఘట్టంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
సరిగ్గా రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్ (RR) టీమ్ (సీఎం రేవంత్ రెడ్డి జట్టు), అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభంలోనే సింగరేణి ఆర్‌ఆర్ టీమ్ వరుసగా రెండు గోల్స్ సాధించి ఆధిపత్యం చెలాయించింది. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మైదానంలోకి దిగి ఆడటమే కాకుండా, ప్రత్యర్థుల రక్షణ వ్యవస్థను ఛేదించి ఒక గోల్‌ను కూడా సాధించారు. ఆ తర్వాత ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కూడా గ్రౌండ్‌లోకి దిగి తమదైన మ్యాజిక్‌ను చూపించారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింగరేణి ఆర్‌ఆర్ 9 టీమ్ (సీఎం జట్టు) విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన సింగరేణి ఆర్‌ఆర్ 9 టీమ్‌కు ట్రోఫీని లియోనెల్ మెస్సీ స్వయంగా అందజేశారు. ప్రపంచ దిగ్గజ క్రీడాకారుడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడంతో సీఎం జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోఫీని అందజేసి క్రీడాకారులను అభినందించారు.
మ్యాచ్ అనంతరం మెస్సీ, రోడ్రిగో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. తమ అభిమాన క్రీడాకారులను, నేతలను చూసిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అంతేకాకుండా, మెస్సీ తన గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ, ముందుగానే ఎంపిక చేసిన తెలంగాణ జిల్లాల్లోని గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కూడిన నాలుగు జూనియర్ టీమ్స్‌తో ముచ్చటించి, వారికి ఫుట్‌బాల్ మెళకువలు, టిప్స్‌ను అందించారు. ఈ మొత్తం కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరై, క్రీడాకారులను, ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. మెస్సీ రాకతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ క్రీడకు అపూర్వమైన గుర్తింపు లభించింది.
Finance Fraud : ఫైనాన్స్ పేరుతో మోసం..! స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ పై ఆగ్రహం